మార్నింగ్‌ వాక్‌కు వెళ్లలేకపోతున్నా!

14 Nov, 2018 10:03 IST|Sakshi

 సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్‌ మిశ్రా ఆవేదన

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రతపై సుప్రీంకోర్టులో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో కాలుష్యం అధికంగా ఉండడం వల్ల తాను ఉదయం వాక్‌కు వెళ్లలేకపోతున్నానని అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్‌ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాలుష్యం ఇంత అధికంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. కాలుష్యం వల్ల ఢిల్లీ వాసులు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేకపోతున్నారని ఆయన చెప్పారు. తాను కూడా గత కొన్ని రోజులుగా ఉదయాన్నే లేచి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లాలనుకుంటానని, కానీ కాలుష్యాన్ని చూసి ఆ ప్రయత్నం మానుకుంటున్నానని న్యాయమూర్తి మిశ్రా చెప్పారు.

కాలుష్య ప్రస్తావన రాగానే ఆందోళన..
న్యాయమూర్తి అరుణ్‌ మిశ్రా, న్యాయమూర్తి వినీత్‌ సరన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉదయం కోర్టు నంబర్‌లో ఆరులో ఉన్నపుడు నగరంలో కాలుష్యం విషయం ప్రస్తావనకు వచ్చింది. కోర్టు రూముకు వస్తూనే న్యాయమూర్తి మిశ్రా అక్కడే ఉన్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాతో నగరంలో కాలుష్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. కాలుష్య తీవ్రత కారణంగా ఆస్తమా వంటి సమస్యలున్న వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టు గదిలో ఉన్న మరో న్యాయవాది వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, నగరంలో శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న ఫుట్‌ బాల్‌ కీడ్రాకారులకు ప్రతి రోజు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నగరంలో స్మాగ్‌ కారణంగా వారికి ఈ పరీక్షలు జరుపుతున్నారు.

రాజధానిని పలకరించిన వర్షం
న్యూఢిల్లీ : ఢిల్లీ–ఎన్సీఆర్‌లో కొన్ని చోట్ల మంగళవారం ఉదయం చిరుజల్లు కురిసింది. కనీస ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగి 14.2 డిగ్రీ సెల్సియస్‌ నమోదైంది. నగరంలో వాయు కాలుష్యం వెరీ పూర్‌ కేటగిరీలో కొనసాగింది. నిర్మాణ కార్యకలాపాలపై, నగరంలో ట్రక్కుల ప్రవేశం విధించిన నిషేధాన్ని ఎన్విరాన్‌మెంట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ అథారిటీ (ఈపీసీఏ)ఎత్తివేసింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్మాణ కార్యకలాపాలు జరపవచ్చని ఈపీసీఏ పేర్కొంది.

రాత్రి వేళ గాలిలో కాలుష్యాల వ్యాప్తి తక్కువగా ఉండడం వల్ల అవి కదలడం లేదని అందువల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే నిర్మాణ కార్యకలాపాలను అనుమతించాలని ఈపీసీఏ పేర్కొంది. ట్రక్కుల ప్రవేశాన్ని కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతించాలని ఈపీసీఏ భావించినప్పటికీ నగరరోడ్లపై ట్రాఫిక్‌ దృష్ట్యా పగటి పూట వాటిని అనుమతించడం సాధ్యం కాదని ట్రాఫిక్‌ పోలీసులు తెలియచేయడంతో రాత్రి పూటనే వాటిని అనుమతించాలని ఈపీసీఏ పేర్కొంది. నగరంలో కాలుష్యం పెరగడంతో ఈ నెల 1 నుంచి 12 వరకు నగరంలో నిర్మాణపనులపై నిషేధం విధించారు. అలాగే నవంబర్‌ 8 నుంచి 12 వరకు ట్రక్కుల ప్రవేశంపై నిసేధం కొనసాగింది.

మరిన్ని వార్తలు