వేకువజామునే ధమాకా

31 Oct, 2018 01:37 IST|Sakshi

దీపావళి నాడు తమిళనాడు, పుదుచ్చేరికి సుప్రీం సడలింపు

‘గ్రీన్‌ క్రాకర్స్‌’ ఢిల్లీకే పరిమితం

న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి మత సంప్రదాయాలకు అనుగుణంగా దీపావళి, ఇతర పండగల సందర్భంగా ఆ రాష్ట్రాల్లో వేకువజామునే 4.30–6.30వరకు బాణసంచా కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. టపాసులు పేల్చే సమయాన్ని మార్చుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని, కానీ అందుకు పరిమితి రెండు గంటలే అని పేర్కొంది. తక్కువ శబ్దం, కాలుష్యం వెదజల్లే గ్రీన్‌ క్రాకర్స్‌కు సంబంధించి తాము జారీచేసిన మార్గదర్శకాలు ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంతానికే పరిమితమని కోర్టు స్పష్టతనిచ్చింది.

తమ మత సంప్రదాయాల ప్రకారం దీపావళి పర్వదినాన ఉదయం పూట బాణసంచా కాల్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని తమిళనాడు దాఖలుచేసిన పిటిషన్‌ను విచారిస్తూ తాజా ఆదేశాలు జారీచేసింది. దీపావళి, ఇతర పండగల సందర్భంగా రాత్రి 8–10 గంటల మధ్యే టపాసులు కాల్చాలని అక్టోబర్‌ 23న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు..గ్రీన్‌ క్రాకర్స్‌ వాడకంపై తామిచ్చిన ఆదేశాలు దేశమంతటికీ వర్తించవని, తీవ్ర కాలుష్యానికి లోనవుతున్న ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంతానికే పరిమితమని పేర్కొంది.

బేరియం సాల్ట్‌పై నిషేధాన్ని ప్రస్తావించిన తయారీదారుల తరఫు లాయర్‌..ఆ రసాయనం లేకుండా బాణసంచా తయారుచేయడం అసాధ్యమని పేర్కొన్నారు. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ ఏఎన్‌ఎస్‌ నాదకర్ణి స్పందిస్తూ.. బేరియం సాల్ట్‌ లేకుండానే బాణసంచా తయారుచేయొచ్చని, ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేస్తానని కోర్టుకు చెప్పారు.

మరిన్ని వార్తలు