వలస కూలీల పరిస్థితిపై స్పందించిన సుప్రీం

26 May, 2020 18:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా వలస కూలీలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో దేశ వ్యాప్తంగా వలస కూలీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలో కూలీలను ఆదుకునేందుకు, వారిని స్వస్థలాలకు చేరవేసేందుకు ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఏంటో తమకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. (కరోనా: రాజకీయ సంక్షోభం తప్పదా..!)

ప్రస్తుతమున్న గడ్డు కాలంలో ఉపాధి కోసం పొట్టచేతపట్టుకుని పోయిన వలస కూలీలను ఆదుకోవాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వారి కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. కూలీల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల వివరాలను తమకు సమర్పించాలని కోరుతూ.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. (యూఎస్‌ లాంటి పరిస్థితి తీసుకురావద్దు: హైకోర్టు)

కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభణతో కేంద్ర ప్రభుత్వం మార్చి 23 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీల ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఉపాధి లేక తింటానికి తిండిలేక బిక్కుబిక్కుమంటూ కాలాన్నీ వెళ్లదీశారు. ఈ క్రమంలోనే చాలామంది నడుచుకుంటూ స్వస్థలాలకు బయలుదేరి.. మార్గంమధ్యంలోనే కన్నుమూశారు. దీంతో కేంద్రం స్పందించి శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసింది. అయినా కూడా చాలామంది కూలీలు ఇంకా కాలిబాటన స్వస్థలాలకు వెళ్తున్న అనేక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వలస కూలీల దుస్థితిని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.

మరిన్ని వార్తలు