మధ్యాహ్న భోజనం పరిస్థితేంటి?

19 Mar, 2020 06:17 IST|Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో స్కూళ్లు  మూతపడటంతో రాష్ట్రాల వివరణ కోరిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలను మూసివేయంతో అందులో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఎలా అందిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు కోర్టు పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం నోటీసులు జారీ చేసింది. కరోనా కారణంగా చాలా స్కూళ్లు మూతపడటంతో కోర్టు సుమోటోగా కేసును స్వీకరించి విచారించింది. కోవిడ్‌–19 వ్యాప్తి దృష్ట్యా ఢిల్లీతోపాటు అనేక రాష్ట్రాల్లోని పాఠశాలలు మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి.

ఒమర్‌ విడుదలపై వారంలో తేల్చండి
జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా విడుదలపై వారంలోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 37 రద్దు సమయంలో రాష్ట్రంలో అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు ప్రభుత్వం గతేడాది ఆగస్టులో ఒమర్‌ను నిర్బంధించింది. ఒమర్‌ నిర్బంధంపై ఆయన సోదరి సారా అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎంఆర్‌. షా ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

ఒమర్‌ విడుదలకు సంబంధించి వారంలోగా వివరణ ఇవ్వాలని కేంద్రం, జమ్మూకశ్మీర్‌ అధికార యంత్రాంగాలను ఆదేశించింది. ‘ఒమర్‌ను విడుదల చేస్తారా? లేదా? ఒకవేళ చేయాలని భావిస్తే వెంటనే విడుదల చేయండి. లేని పక్షంలో ఈ పిటిషన్‌పై విచారణ చేపడతాం’అని పేర్కొంది. ఈ కేసులో వాదనలు వినిపించాల్సిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వేరే కోర్టులో వేరే కేసు విచారణలో ఉన్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.

మరిన్ని వార్తలు