సీబీఎస్‌ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు

27 Jun, 2020 05:18 IST|Sakshi

జూలై 15వ తేదీ నాటికి ఫలితాలు

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా జూలైలో జరగాల్సిన పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. మిగిలిన పేపర్లకు మార్కులు వేసే సీబీఎస్‌ఈ నాలుగు అంశాల ఫార్ములాకు కూడా న్యాయస్థానం ఆమోదం తెలిపింది. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున జూలై 1నుంచి 15వ తేదీల మధ్యన జరగాల్సిన సీబీఎస్‌ఈ పెండింగ్‌ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సంజయ్‌ ఖన్నాల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

కేంద్రం, సీబీఎస్‌ఈ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున 10, 12వ తరగతి పెండింగ్‌ సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్‌ఈ నిర్ణయించాయన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు బోర్డు పరీక్షలు నిర్వహించలేమంటూ అశక్తత వ్యక్తం చేశాయని ఆయన ధర్మాసనానికి తెలిపారు. 10, 12వ తరగతి విద్యార్థులు ఇప్పటికే నిర్వహించిన పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారని తెలిపారు. జూలై 15వ తేదీ నాటికి ఫలితాలను వెల్లడిస్తామన్నారు.

మిగిలి ఉన్న పరీక్షలకు హాజరు కావడమా లేక ఇప్పటికే హాజరైన పరీక్షల్లో చూపిన ప్రతిభను బట్టి వేసే మార్కులకు అంగీకరించడమా అనే ఆప్షన్‌ను 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నామన్నారు.  సీబీఎస్‌ఈ విధానాన్నే అటూఇటుగా తామూ అనుసరిస్తామని ఇండియన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(ఐసీఎస్‌ఈ) ధర్మాసనానికి నివేదించింది. 10,12వ తరగతి పరీక్షల ఫలితాలను జూలై 15వ తేదీకల్లా ప్రకటిస్తామని ఐసీఎస్‌ఈ తెలిపింది. 10, 12వ తరగతులకు గత పరీక్షల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగానే ఫలితాలు ప్రకటిస్తామని ఐసీఎస్‌ఈ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి భయంతో సీబీఎస్‌ఈ పరీక్షలు  అర్థంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

అత్యుత్తమ సరాసరి మార్కులే ఆధారం
10, 12వ తరగతి విద్యార్థి ఇప్పటికే రాసిన పరీక్షల్లో చూపిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగానే  రద్దయిన పరీక్షల సబ్జెక్టులకు మార్కులు నిర్ణయిస్తామని సీబీఎస్‌ఈ ప్రకటించింది. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టుల పరీక్షలు రాసిన వారికి, మూడు పరీక్షల్లో సాధించిన అత్యుత్తమ మార్కుల సరాసరిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. మూడు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికైతే రెండు సబ్జెక్టుల్లో మార్కులను బట్టి మార్కులు వేస్తాయనుంది. ఢిల్లీలో అల్లర్ల కారణంగా 12వ తరగతి ఒకటి, రెండు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికి... రాసిన సబ్జెక్టులు, ఇంటర్నల్‌/ప్రాక్టికల్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను నిర్ణయిస్తారు.  

మరిన్ని వార్తలు