ప్రొఫెసర్ సాయిబాబా కేసును రోజూ విచారించండి

1 Mar, 2016 01:05 IST|Sakshi
ప్రొఫెసర్ సాయిబాబా కేసును రోజూ విచారించండి

ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
 
 న్యూఢిల్లీ: నక్సల్స్ తో సంబంధాల ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కేసును ప్రతిరోజూ విచారించాలని మహారాష్ట్రలోని విచారణ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సాయిబాబా బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం జస్టిస్ జేఎస్ ఖేహర్, సీ నాగప్పన్‌ల ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. నెల రోజుల్లోపు ప్రాసిక్యూషన్ వారు ఇచ్చిన 8 ప్రధాన సాక్ష్యాలను పరిశీలించాలని గడ్చిరోలిలోని ట్రయల్ కోర్టుకు సూచించింది.

వీటిని పరిశీలించాకే బెయిల్ మంజూరును పరిగణలోకి తీసుకుంటామంది. సాయిబాబా సహా నిందితులందరూ విచారణకు సహకరించాలని ఆదేశించింది. తదుపరి విచారణ తేదీ అయిన ఏప్రిల్ 4లోగా సంబంధిత వివరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం వేసిన కౌంటర్, అదనపు అఫిడవిట్‌లను అధ్యయనం చేశామని, సాయిబాబా న్యాయవాది వాదనలను విన్నామని ధర్మాసనం తెలిపింది.

>
మరిన్ని వార్తలు