ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల వివరాలివ్వండి

13 Sep, 2018 02:17 IST|Sakshi

రాష్ట్రాలు, హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశం 

న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులపై పెండింగ్‌లో ఉన్న కేసుల పూర్తి వివరాలను తమకు సమర్పించాలని 25 రాష్ట్రప్రభుత్వాలను, హైకోర్టులను, కేంద్రపాలిత రాష్ట్రాలను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌ కేసుల విచారణ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టులకు వాటిని బదిలీచేయాల్సి ఉందని జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ నవీన్‌ సిన్హాల బెంచ్‌ వ్యాఖ్యానించింది. 11 రాష్ట్రాల్లో ఇప్పటికే 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు పూర్తయిందని, కేసుల వివరాలన్నీ అక్టోబర్‌ 10కల్లా ఆ కోర్టులకు చేరాల్సి ఉందని బెంచ్‌ తెలిపింది.

వివరాలు సమర్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, హైకోర్టుల రిజిస్ట్రార్స్‌ జనరల్స్‌దే అని బెంచ్‌ స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టుకు 25 కేసులు బదిలీ అయ్యాయని కేంద్రం గతంలో తన అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే, ఇవిగాక మరెన్ని కేసులు ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్నాయో తేల్చాలని పిటిషనర్‌ సుప్రీం బెంచ్‌ను కోరడంతో అన్ని రాష్ట్రాలకూ కోర్టు ఆదేశాలిచ్చింది. 2014 ఎన్నికల సందర్భంగా నామినేషన్‌ పత్రాల దాఖలు నాటికి వీరందరిపై దేశవ్యాప్తంగా 1,581 కేసులున్నాయని కేంద్రం గతంలో తెలిపింది.   

మరిన్ని వార్తలు