2013లోనే ములాయంపై కేసు మూసేశాం

13 Apr, 2019 03:46 IST|Sakshi

సుప్రీంకోర్టుకు వెల్లడించిన సీబీఐ 

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు,సమాజ్‌వాదీ పార్టీ నేతలు ములాయం సింగ్‌ యాదవ్, అఖిలేశ్‌యాదవ్‌లపై నమోదయిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రాథమిక విచారణను 2013లోనే ముసివేశామని సీబీఐ సుప్రీం కోర్టుకు తెలిపింది. సీబీఐ మౌఖిక నివేదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన దాఖలైన తాజా పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని సీబీఐని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగాయ్‌ అధ్యక్షతన గల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ విచారణ ఏ స్థాయిలో ఉందో తెలపాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత విశ్వనాథ్‌చతుర్వేది తాజాగా పిటిషన్‌దాఖలు చేశారు. ములాయం రెండో కుమారుడు ప్రతీక్‌ను కూడా తాజా పిటీషన్‌లో చేర్చారు.

దీనిని మార్చి25న విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు రెండు వారాల్లోగా దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా సీబీఐ న్యాయవాది తుషార్‌ మెహతా,సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌లను ఆదేశించింది. ఈ ఎన్నికల్లో ములాయం సింగ్‌ యాదవ్‌ ఉత్తర ప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.కాగా, రాజకీయంగా తనను దెబ్బతీయడానికి, ఎన్నికల్లో తన పరువు తీయడానికే చతుర్వేదీ ఈ పిటషన్‌ దాఖలు చేశారని ములాయం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఈ కేసులో సీబీఐ,ఆదాయం పన్ను శాఖల అధికారులు 2005లోనే దర్యాప్తు జరిపారని, తమనేరాన్ని నిరూపించే ఆధారాలేమీ వారికి లభించలేదని తెలిపారు. చతుర్వేది ఆ పాత కేసును తిరగదోడటం ద్వారా తమ రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.తాను, తన కుమారుడు అఖిలేశ్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిసి రాజకీయ దురుద్దేశంతోనే చతుర్వేది ఈ పిటిషన్‌ దాఖలు చేశారన్నారు.తమపై పెట్టిన కేసులో సీబీఐ రెండేళ్ల పాటు దర్యాప్తు జరిపినా ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయిందని ములాయం తెలిపారు.
 

మరిన్ని వార్తలు