సీజేఐపై కుట్ర.. ప్రత్యేక విచారణ

26 Apr, 2019 03:29 IST|Sakshi
జస్టిస్‌ పట్నాయక్‌, జస్టిస్‌ ఇందూ

రిటైర్డ్‌ జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ను నియమించిన సుప్రీంకోర్టు

‘సీజేఐ వేధింపుల వివాదం’ త్రిసభ్యకమిటీ నుంచి తప్పుకున్న జస్టిస్‌ రమణ

ఆయన స్థానంలో జస్టిస్‌ ఇందూ మల్హోత్రా

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌తోపాటు, న్యాయమూర్తులపై భారీ కుట్ర జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. విచారణ సమయంలో ఆయనకు సహకరించాలంటూ సీబీఐ, ఐబీ డైరెక్టర్లతోపాటు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌లకు ఆదేశాలిచ్చింది. అవసరమైతే ఇతరుల సాయం తీసుకోవచ్చంది.

ఈ ఏకసభ్య కమిటీకి సీజేఐ అనుచిత ప్రవర్తన ఆరోపణలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ తన దర్యాప్తు నివేదికను సీల్డు కవర్‌లో అందజేయాలని కోరింది. సీజేఐతో రాజీనామా చేయించేందుకు, ఇతర న్యాయమూర్తులను ప్రలోభాలకు గురిచేసి, తీర్పులను ప్రభావితం చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందంటూ న్యాయవాది ఉత్సవ్‌ సింగ్‌ బైన్స్‌ వేసిన అఫిడవిట్‌ను గురువారం జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ప్రత్యేక ధర్మాసనం విచారించి, పై ఉత్తర్వులను వెలువరించింది.  అఫిడవిట్‌లో పేర్కొన్న వివిధ అంశాలపై కమిటీ కోరినప్పుడు వివరణ ఇవ్వాలని లాయర్‌ను ఆదేశించింది.  

త్రిసభ్య కమిటీపై అభ్యంతరాలు..
సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగిని అంతర్గత విచారణకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీజేఐకు జస్టిస్‌ రమణ సన్నిహిత మిత్రుడని, నిత్యం సీజేఐ నివాసానికి ఆయన వెళ్తుంటారని, కమిటీలో ఆయన ఉండటం వల్ల తాను సమర్పించిన ఆధారాలు, అఫిడివిట్‌పై సరైన విచారణ జరుగుతుందని భావించడం లేదని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, కమిటీలో మహిళా జడ్జి ఇందిరా బెనర్జీ ఒక్కరు మాత్రమే ఉండటంపైనా ఆమె జస్టిస్‌ బాబ్డేకు రాసిన లేఖలో అభ్యంతరం లేవనెత్తారు.  కాగా, సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తునకు నియమించిన కమిటీ నుంచి జస్టిస్‌ ఎన్‌వీ రమణ తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన సీజేఐకు సుదీర్ఘ లేఖ రాశారు. దీంతో ఆయన స్థానంలో జస్టిస్‌ ఇందూ మల్హోత్రాను నియమిస్తూ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ఉత్తర్వులు జారీ చేశారు.  అయితే, ఫిర్యాదుదారు అభ్యంతరం తెలిపిన కారణంగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ వైదొలగలేదని సమాచారం.

మరిన్ని వార్తలు