దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: సుప్రీం సంచలన ఆదేశాలు

12 Dec, 2019 12:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశిస్తూ రిటైర్డు జడ్జి జస్టిస్‌ వికాస్‌ శ్రీధర్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో సుప్రీంకోర్టు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఘటనపై ఆరు నెలల్లో విచారణ జరిపి దర్యాప్తు నివేదిక అందజేయాలని కమిషన్‌ను ఆదేశించింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం రెండో రోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. నిందితులు తుపాకులు లాక్కొని కాల్పులు జరిపారని.. ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని రోహత్గీ కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో... నిందితులు కాల్పులు జరిపితే బుల్లెట్లు ఏవి అని సుప్రీంకోర్టు ఆయనను ప్రశ్నించింది. నిందితుల కాల్పుల్లో పోలీసులు ఎవరూ గాయపడలేదా అని ప్రశ్నలు సంధించింది. ఇందుకు బదలుగా నిందితులు కాల్చిన బుల్లెట్లు దొరకలేదని రోహత్గీ న్యాయస్థానానికి సమాధానమిచ్చారు.

ఇక దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ విరుద్ధమంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సుప్రీంకోర్టు లాయర్‌ మణిపై సైతం సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా.. వెటర్నరీ డాక్టర్‌కు మానవ హక్కులు ఉండవా అని దిశ అత్యాచారం, హత్య ఘటన గురించి మణిని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితులకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలని పిటిషనర్‌ కోరగా.. నిందితులు ఎంత పెద్ద నేరం చేసి ఉండి ఉంటారో మేం విస్మరించలేమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పరిహారం ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించలేమని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటన్‌ కేసుపై రిటైర్డు జడ్జితో కమిషన్‌ వేసి విచారణ జరిపిస్తామని పేర్కొన్న సుప్రీంకోర్టు... వారు ఇచ్చే నివేదికను ఓ కమిటీ పరిశీలిస్తుందని వెల్లడించింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన జస్టిస్‌ వికాస్‌ శ్రీధర్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో ఎంక్వైరీ కమిషన్‌ ఏర్పాటు చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా ప్రకాశ్‌, సీబీఐ మాజీ చీఫ్‌ కార్తికేయన్‌ ఇందులో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. వీరి దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరించాలని ఆదేశించింది.

ఈ క్రమంలో రిటైర్డు జడ్జితో విచారణ జరిపితే తమకు అభ్యంతరం లేదని ముకుల్‌ రోహత్గి కోర్టుకు తెలిపారు. అయితే మీరే స్వయంగా విచారణ చేపట్టినైతే మళ్లీ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ విచారణ ఎందుకు అని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందనగా.. రెండు విచారణలు సమాంతరంగా జరిగితే అభ్యంతరం ఏముందన్న కోర్టు.. ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిందేనని స్పష్టం చేసింది. అదే విధంగా దిశ కేసులో మీడియా తీరుపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయోధ్య కేసు తరహాలో ఈ కేసులో కూడా సంయమనం పాటించి ఉండాల్సింది అని అభిప్రాయపడింది. మీడియా కవరేజి వల్ల కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని.. కాబట్టి సంయమనం పాటించాలని సూచించింది. కాగా దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారని, అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీలతోపాటు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌లను పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా