కావేరి వివాదం.. కర్ణాటకకు సుప్రీంకోర్టు ఆదేశాలు

4 Oct, 2016 20:45 IST|Sakshi
కావేరి వివాదం.. కర్ణాటకకు సుప్రీంకోర్టు ఆదేశాలు

తమిళనాడుకు రోజుకు 2వేల క్యూసెక్కులు
కావేరి జలాల విడుదలకు కర్ణాటకను ఆదేశించిన సుప్రీంకోర్టు

బెంగళూరు: తమిళనాడుకు రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున కావేరి జలాలను ఈ నెల ఏడు నుంచి 18 వరకూ విడుదల చేయాలని జస్టిస్ ఉదయ్‌లలిత్, జస్టిస్ దీపక్‌మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కర్ణాటకను మంగళవారం ఆదేశించింది. కావేరి నదీ జలాల వివాదానికి సంబంధించి గత నెల ఐదు నుంచి ద్విసభ ధర్మాసనం ముందు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ధర్మాసనం మంగళవారం తమిళనాడు, కర్ణాటకతో పాటు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రస్తోగి వాదనలు విన్నది. తమిళనాడుకు నీటిని విడుదల చేయడంతో పాటు కేంద్ర జల సంఘం చైర్మన్ జీఎస్ ఝ నేతృత్వంలో నిపుణుల కమిటీ కావేరి నదీ పరివాహక రాష్ట్రాల్లో పర్యటించి ఈ నెల 17న నివేదిక అందజేయాలని ఆదేశించింది.

అలాగే కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటుపై స్టే విధిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. అంతకుముందు వాదనల సందర్భంగా గత నెల 30న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి రోజుకు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 36వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని సర్వోన్నత న్యాయస్థానానికి కర్ణాటక తెలియజేసింది. ఇక అటార్నీ జనరల్ వాదిస్తూ కావేరి నీటి నిర్వహణ మండలి సుప్రీం పరిధిలోకి రాదని, గతంలో సరైన అవగాహన లేకపోవడంతో మండలి ఏర్పాటుకు సమ్మతించామని తెలిపారు.

ఇక తమిళనాడు మాత్రం ఎప్పటి లాగానే మండలి ఏర్పాటుకు పట్టుబట్టింది. కర్ణాటక కోరుతున్నట్లే మండలి ఏర్పాటు నిలిచిపోవడం, నీటి లభ్యత అనుసరించి రెండు వేల క్యూసెక్కులు వదలడం కష్టం కాబోదని నిపుణులు చెబుతుండటం, క్షేత్రస్థాయి పర్యటన కోసం నిపుణుల కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు అంగీకరించడం వల్ల కర్ణాటకకు ఊరట లభించిందని సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు న్యాయనిపుణులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు