దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: సుప్రీం కీలక వ్యాఖ్యలు

11 Dec, 2019 14:17 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్‌) బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తునకై సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా ఈ కేసు విచారణకై విశ్రాంత న్యాయమూర్తులను సూచించాలని ప్రతివాదులకు సూచించింది. దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారని, అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్ అరవింద్‌ బాబ్డే స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్‌పై తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. రిటైర్డు న్యాయమూర్తితో ఈ కేసు దర్యాప్తు పరిశీలిస్తామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీల జాబితాను ప్రతివాదులకు ఇవ్వాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.(చదవండి: అది బూటకపు ఎన్‌కౌంటర్‌)

ఈ సందర్భంగా.. ‘ఎన్‌కౌంటర్‌ కేసును తెలంగాణ హైకోర్టు చూసుకుంటుంది.. ఎన్‌కౌంటర్‌ వెనుక నిజాలను సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి వెలికితీస్తారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయమేమిటి’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ నుంచే సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ఎన్‌కౌంటర్ కేసు పరిశీలిస్తారని స్పష్టం చేసింది. ఈ క్రమంలో దర్యాప్తు కోసం విశ్రాంత న్యాయమూర్తి పీవీ రెడ్డిని సంప్రదించగా.. ఆయన ఇందుకు నిరాకరించారని సీజేఐ జస్టిస్ బాబ్డే తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ముకుల్‌ రోహత్గి.. ప్రభుత్వం వాదనలు విన్న తర్వాతే ముందుకు వెళ్లాలని కోర్టుకు విన్నవించారు. తమ అభిప్రాయం వినకుండా ఆదేశాలు జారీ చేయొద్దని కోరారు. దీంతో దర్యాప్తునకై సలహాలు, సూచలనలతో రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం... విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీలతోపాటు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌లను పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చిన విషయం తెలిసిందే. సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని, లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీస్‌ బృందంతో విచారణ జరిపించాలని విన్నవించారు. 
 

మరిన్ని వార్తలు