ఇంటర్నెట్‌ ప్రజల ప్రాథమిక హక్కు

11 Jan, 2020 02:59 IST|Sakshi
శ్రీనగర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్నెట్‌ సెంటర్‌లో మీడియా ప్రతినిధులు

ఇంటర్నెట్‌పై ఆంక్షల్నివారంలోగా సమీక్షించాలి

కశ్మీర్‌ పాలనాయంత్రాంగానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

సాక్షి /న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ సదుపాయంపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం ఇంటర్నెట్‌ ప్రజల ప్రాథమిక హక్కు అని తెలిపింది. వాక్‌ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ–బిజినెస్‌ నిర్వహించడం ఇటీవల కాలంలో ఇంటర్నెట్‌ ద్వారా ఎక్కువగా జరుగుతోందని, ఆ సేవల్ని నిరవధికంగా నిలిపివేయకూడదని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షల్ని వారంలోగా సమీక్షించాలని కశ్మీర్‌ పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత ఇంటర్నెట్‌ తదితరాలపై విధించిన ఆంక్షలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.

ఏ టేల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌ వాక్యాలతో..
‘‘అది ఒక వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన శకం, వెల్లివిరిసిన విజ్ఞానం, బ్రహ్మజెముడులా అజ్ఞానం, స్వర్గానికి రాచబాట పుచ్చుకున్న జనం నడుస్తున్నారు నరకానికి’’అంటూ చార్లెస్‌ డికెన్స్‌ రాసిన రెండు మహానగరాలు(ఏ టెల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌) నవలలోని వాక్యాలను జస్టిస్‌ ఎన్వీ రమణ తన తీర్పులో ఉటంకించారు. భూతల స్వర్గంగా కశ్మీర్‌ మన హృదయాల్లో నిలిచినప్పటికీ, ఈ అందమైన ప్రాంతపు చరిత్ర హింస, తీవ్రవాదంతో కూడుకొని ఉంది’ అని వ్యాఖ్యానించారు. పౌరుల స్వేచ్ఛను, వారి భద్రతను సమతుల్యం చేయడమే కోర్టుల పని అని ఆయన పేర్కొన్నారు. ‘భావప్రకటనా స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని చేపట్టే స్వేచ్ఛ, ఇంటర్నెట్‌ ఆధారంగా జరిగే వ్యాపార లావాదేవీలన్నింటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1), ఆర్టికల్‌ 19(1)(జీ) రక్షణ కల్పిస్తోందని జస్టిస్‌ ఎన్వీ రమణ తన 130 పేజీల తీర్పులో పేర్కొన్నారు.

ప్రాథమిక హక్కుల్ని కాలరాయకూడదు
సీఆర్‌పీసీ 144వ సెక్షన్‌ ద్వారా జారీ చేసే ఉత్తర్వులు ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తాయని, వాటిపై నిరవ«ధికంగా ఉక్కుపాదం మోపకూడదని ధర్మాసనం పేర్కొంది. ఈ అధికారాన్ని అతిగా వినియోగిస్తే అక్రమాలకు దారితీస్తుందని పేర్కొంది.  అత్యవ సర సేవలైన ఆసుపత్రులు, విద్యాసంస్థలతో పాటుగా ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఈ బ్యాంకింగ్‌ రంగంలో ఇంటర్నెట్‌ను తక్షణమే పునరుద్ధరించా లని ఆదేశించింది.  ఇంటర్నెట్‌ సౌకర్యం ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించింది.

కశ్మీర్‌లో విదేశీ రాయబారుల పర్యటన
జమ్ము: కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారిగా అమెరికా సహా 15 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. అక్కడ వివి«ధ పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల్ని కలుసుకొని మాట్లాడారు. కశ్మీర్‌ చీఫ్‌ సెక్రటరీ బీవీఆర్‌ సుబ్రహ్మణియన్, డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌లతో కూడిన అత్యున్నత స్థాయి బృందం కశ్మీర్‌ లోయలో పరిస్థితుల్ని దౌత్యవేత్తలకు వివరించింది. పౌర సంఘాల ప్రతిని«ధుల్లో ఎక్కువ మంది తాము ఆర్టికల్‌ 370కి మద్దతు ఇస్తున్నట్టుగా దౌత్యవేత్తలకు తెలిపారు. భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌తో సహా వీరంతా శ్రీనగర్‌లో ఏడు గంటలకు పైగా గడిపారు.

మోదీ సర్కార్‌కు  పెద్ద ఝలక్‌ : కాంగ్రెస్‌
ఇంటర్నెట్‌ సదుపాయం ప్రజల ప్రాథమిక హక్కు అని తేల్చి చెప్పడం ద్వారా సుప్రీంకోర్టు మోదీ సర్కార్‌కు గట్టి ఝలక్‌ ఇచ్చిందని కాంగ్రెస్‌ పేర్కొంది. ప్రజల అసమ్మతి జ్వాలల్ని నిషే«ధాజ్ఞల ద్వారా ఎక్కువ కాలం తొక్కి పెట్టి ఉంచలేరని కాంగ్రెస్‌ నాయకుడు రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ట్వీట్‌ చేశారు. మోదీ సర్కార్‌ చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సుప్రీం తీర్పు ద్వారా 2020లో తొలి దెబ్బ తగిలిందన్నారు. మొదటిసారిగా సుప్రీంకోర్టు కశ్మీర్‌ ప్రజల మనోభావాలపై మాట్లాడిందని కాంగ్రెస్‌ ఎంపీ గులాం నబీ ఆజాద్‌ అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా