ఏపీలో ఎన్నికల వాయిదా: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

18 Mar, 2020 15:45 IST|Sakshi

ఎన్నికల కోడ్‌ను వెంటనే ఎత్తివేయండి

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగనివ్వండి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. తదుపరి స్థానిక ఎన్నికల తేదీలు ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికలను వాయిదా వేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసినందున.. ఎన్నికల నిర్వహణపై ఇప్పుడు జోక్యం చేసుకోలేమని.. అయితే ఎన్నికల ప్రవర‍్తనా నియమావళిని తక్షణమే ఎత్తివేయాలని ఆదేశించింది. అదే విధంగా ఇదివరకే ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల సంఘం అడ్డుకోరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్‌ నిర్ణయంలో రాజకీయ కోణాలు ఉన్నాయంటూ ప్రభుత్వ తరఫున అడిషనల్‌ సొలిటర్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.(‘సుప్రీంకోర్టు ఆదేశాలు టీడీపీకి చెంపపెట్టు’)

 అదే విధంగా.. ఒకవైపున ఎన్నికల ప్రక్రియను నిరంతరాయంగా వాయిదా వేస్తూ.. మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కొనసాగిస్తారంటూ తన వాదనలు వినిపించారు. ‘‘ఒకే సమయంలో ఈ రెండూ ఎలా చేయగలుగుతారు?.. ప్రభుత్వం, పాలన స్తంభించపోవాలా?... ఇందులో రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, తీసుకుంటున్న చర్యలను ఎన్నికల కమిషనర్‌ తెలుసుకోలేదు.. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించి కొనసాగిస్తోంది.. వీటిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటున్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే.. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కెవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు... ఎన్నికల కమిషనర్‌ ఒక పొలిటికల్‌ లైన్‌ ప్రకారం వెళ్లారని అర్థమవుతోంది.. ఎన్నికలను వాయిదా వేయడానికి అనుసరించాల్సిన పద్ధతిలో వెళ్లలేదు.. ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైన సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం తీసుకోవడం సరికాదు’’ అని పేర్కొన్నారు. (ఉనికి కోల్పోతామనే చంద్రబాబు కుట్రలు..)

ఈ క్రమంలో ... తమ నిర్ణయంలో ఎలాంటి రాజకీయం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే.. తప్పకుండా రాజకీయాలు ఉండకూడదు.. కానీ పరిస్థితి ఇంతవరకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక.. కోడ్‌ ఉంటుందని, ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుచుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మరోసారి వాదనలు వినిపించారు. దీంతో... ‘‘ఒకవైపు ఎన్నికలను వాయిదా వేస్తామంటున్నారు.. ఇంకోవైపున ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొనసాగిస్తామంటున్నారు. రెండు విధాలుగా ఎలా చేస్తారు’’ అంటూ జస్టిస్‌ గవాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్తంభించిపోవాలని కోరుకుంటున్నారా’’ అని ప్రశ్నించారు. (ఏ నివేదికల ఆధారంగా ఎన్నికలు నిలిపివేశారు! )

ఇందుకు స్పందనగా.. ఎన్నికల సంఘం ఒక లైన్‌ ప్రకారం వెళ్లిందని.. ప్రభుత్వం పనిచేయకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశం కనిపిస్తోందని అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ మరోసారి న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టాల పంపిణీని హైకోర్టు నిలుపుదల చేసిందంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయవాది సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించబోగా.. అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ వెంటనే అడ్డుకున్నారు. అలాంటి ఆదేశాలేవీ హైకోర్టు ఇవ్వలేదని, ఏజీ కూడా ఇక్కడే ఉన్నారంటూ సుప్రీంకోక్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం... ప్రభుత్వం చేస్తున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి రాష్ట్ర ఎన్నికల సంఘం రీ నోటిఫై చేయాలని ఆదేశించింది. ఇలా చేస్తే ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయవాది వాదించబోగా.. ఒక పార్టీ రాజకీయ వైఖరికి అనుగుణంగా సదరు న్యాయవాది వ్యవహరిస్తున్నారంటూ మరోసారి అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ తన వాదనలు వినిపించారు. (ఫైల్‌  లేకుండానే నిర్ణయం?)

మరిన్ని వార్తలు