‘నిరసన’ ప్రాథమిక హక్కే.. కానీ! 

18 Feb, 2020 03:17 IST|Sakshi

షహీన్‌బాగ్‌ నిరసనలపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ఒక చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం ప్రాథమిక హక్కే కానీ, ఆ కారణంగా రహదారుల దిగ్బంధనం జరగడం ఆందోళనకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.  ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతంలోకి తమ నిరసనల కేంద్రాన్ని మార్చుకోవాలని పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక ఆందోళనకారులకు సూచించింది. సీఏఏకి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో నిరసనల కారణంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది ఎదురవుతోందంటూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా పైవిధంగా స్పందించింది. భావ ప్రకటన ప్రజాస్వామ్యంలో అవసరమే కానీ, దానికీ హద్దులుండాలంది. మరో ప్రదేశానికి నిరసన ప్రాంతాన్ని మార్చేలా ఒప్పించాలని న్యాయవాది సంజయ్‌ హెగ్డేని ఆదేశించింది.

సందీప్‌ పాండే అరెస్ట్‌ 
లక్నో: సామాజిక కార్యకర సందీప్‌ పాండేను సోమవారం లక్నో పోలీసులు అరెస్ట్‌ చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేయాలని తలపెట్టిన పాండే.. కరపత్రాలను పంచుతుండగా అదుపులోకి తీసుకున్నారు.

సతీసహగమనం హత్యే 
‘ప్రార్థనాస్థలాల్లో దానం చేయడం మతపరమైన ఆచారమే కావచ్చు. అటువంటి ప్రదేశాల్లో విరాళంగా ఇచ్చిన ఆ డబ్బుని టెర్రరిజానికి ఉపయోగిస్తే మాత్రం చట్టం అంగీకరించదు’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.  ఆత్మత్యాగం, సతీసహగమనం వంటివి  హత్యల కిందికే వస్తాయని, వాటిని  విశ్వాసాల పేరుతో కొనసాగినవ్వలేమని  తేల్చి చెప్పింది. ప్రార్థనాలయాల్లో మత స్వేచ్ఛ, లింగ వివక్షపై చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం  విచారణ ప్రారంభించింది.

మరిన్ని వార్తలు