లవ్‌ జిహాద్‌ కేసు.. కీలక తీర్పు

8 Mar, 2018 14:51 IST|Sakshi
సుప్రీం కోర్టు.. హదియా (ఫైల్‌ ఫోటోలు)

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లవ్‌ జిహాదీ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హదియా వివాహాన్ని రద్దు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ గురువారం తీర్పు వెలువరించింది. తన భర్తతో జీవించే హక్కు హదియాకు ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

గతంలో తిరువనంతపురం హైకోర్టు హదియా విహాహం చెల్లదంటూ తీర్పునివ్వగా.. దానిని సవాల్‌ చేస్తూ ఆమె భర్త షఫీన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం నేడు కీలక ఆదేశాలు వెలువరిస్తూ ‘ఈ వ్యవహారంలో జోక‍్యం చేసుకునే అధికారం దిగువ న్యాయస్థానానికి లేదు’ అని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు న్యాయ సమ్మతం కాదని.. వారి వివాహం వారి ఇష్టప్రకారం జరిగిందేనని బెంచ్‌ పేర్కొంది. అంతేకాదు భర్త షఫీన్‌ తో జీవించేందుకు ఆమెకు స్వేచ్ఛ ఉందంటూ కోర్టు తెలిపింది.

అదే సమయంలోజాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)ను కేవలం ఉగ్ర కోణంలో మాత్రమే దర్యాప్తు కొనసాగించాలని, వైవాహిక జీవితంలో జోక్యం చేసుకూడదని ఆదేశించింది.  ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. 

కాగా, కేరళకు చెందిన అఖిల ఆశోకన్‌(25) అనే యువతి 2016 డిసెంబర్‌లో మతమార్పిడికి పాల్పడి హదియాగా పేరు మార్చుకుని షఫీన్‌ జహాన్‌ను  వివాహం చేసుకుంది. అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం ‘లవ్ జిహాద్ కేసు’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై కేరళ హైకోర్టు వివాహాన్ని రద్దు చేయటం.. కేసు ఎన్‌ఐఏ కు దర్యాప్తునకు అప్పగించటం తెలిసిందే.

మరిన్ని వార్తలు