షెల్టర్‌ హోం కేసు: ఢిల్లీ కోర్టుకు బదలాయించిన సుప్రీం

7 Feb, 2019 15:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : షెల్టర్‌ హోంల నిర్వహణ పట్ల బిహార్‌ ప్రభుత్వం తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోంలో బాలికలపై లైంగిక వేధింపుల కేసును ఢిల్లీ కోర్టుకు బదలాయించాలని ఆదేశించింది. షెల్టర్‌ హోం కేసులన్నింటినీ బిహార్‌ సీబీఐ కోర్టు నుంచి ఢిల్లీలోని పోక్సో సాకేత్‌ ట్రయల్‌ కోర్టుకు రెండు వారాల్లోగా తరలించాలని ఆదేశించింది.

ఆరు నెలల్లోగా షెల్టర్‌ హోం కేసుల విచారణను ముగించాలని సాకేత్‌ కోర్టును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ ఆదేశించింది. గత ఏడాది ముజఫర్‌పూర్‌ వసతి గృహంలో దాదాపు 40 మందికి పైగా బాలికలపై అఘాయిత్యాలు జరిగిన వార్త బయటపడడంతో దేశవ్యాప్తంగా సంచలంగా మారిన సంగతి తెలిసిందే. బ్రజేష్‌ ఠాకూర్‌ అనే వ్యక్తి నడుపుతున్న ఎన్జీవో ఆధ్వర్యంలోని వసతి గృహంలో ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి.

కాగా, కేసు రికార్డుల తరలింపు, సాక్షుల హాజరు వంటి అంశాల్లో సీబీఐకి సహకరించాలని బిహార్‌ ప్రభుత్వాన్ని కోరింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కేసులో గత ఏడాది డిసెంబర్‌ 19న సీబీఐ చార్జిషీట్‌ను నమోదు చేసింది. షెల్టర్‌ హోం లైంగిక దాడి కేసును విచారిస్తున్న అధికారిని బదిలీ చేయడం పట్ల సీబీఐపై కోర్టు మండిపడింది. దీనిపై వివరణ ఇస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని దర్యాప్తు ఏజెన్సీని సుప్రీం బెంచ్‌ ఆదేశించింది.

షెల్టర్‌ హోంలో చిన్నారులపై లైంగిక అకృత్యాలు సాగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని బిహార్‌ ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. ఈ కేసులకు సంబంధించిన సమాచారాన్ని అందించని పక్షంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి కోర్టు సమన్లు జారీ చేస్తుందని స్పష్టం చేసింది. ముజఫర్‌పూర్‌లో ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న షెల్టర్‌ హోంలో పలువురు బాలికలపై హోం నిర్వాహకులు లైంగిక దాడి జరిగిందనే ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ నివేదిక ద్వారా షెల్టర్‌ హోం బాలికలపై లైంగిక వేధింపుల ఉదంతం గత ఏడాది మేలో వెలుగుచూసింది.

>
మరిన్ని వార్తలు