శిశువు ఆందోళనల్లో పాల్గొందా?

11 Feb, 2020 04:49 IST|Sakshi

షహీన్‌బాగ్‌ నిరసనల్లో చిన్నారి మృతిపై సుప్రీం వ్యాఖ్య

న్యూఢిల్లీ: ‘నాలుగు నెలల శిశువు తనంతట తానే ఆందోళనల్లో పాల్గొందా?’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న నిరసనల్లో చిన్నారి మృతి చెందడంపై కోర్టు పైవిధంగా స్పందించింది. షహీన్‌బాగ్‌ నిరసనల్లో 4 నెలల చిన్నారి చనిపోవడంపై జాతీయ సాహస అవార్డు గ్రహీత, ముంబైకి చెందిన జెన్‌ గుణ్‌రతన్‌ సదవర్తే(10) అనే బాలిక రాసిన లేఖను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌ల బెంచ్‌ సోమవారం విచారణ చేపట్టింది. ‘నిరసనల్లో పాలుపంచుకున్న చిన్నారులను స్కూళ్లలో తోటి వారు ఉగ్రవాదులు, విప్లవకారులు, పాకిస్తానీ అనే పేర్లతో పిలుస్తున్నారు. దీంతో వారు ఏడ్చుకుంటూ ఇళ్లకు వస్తున్నారు’అంటూ షారూక్‌ ఆలం, నందితా రావ్‌ అనే మహిళా న్యాయవాదులు పేర్కొన్నారు.

నిరసన తెలపడం చిన్నారుల హక్కు అని ఐక్యరాజ్యసమితి తీర్మానాల్లో కూడా ఉందని, దీనిని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించడం తగదని వారు వాదించారు. తీవ్రంగా స్పందించిన ధర్మాసనం.. ‘ప్రమాదకరమైన ఆ సమర్థనను ఆపండి. అలాంటి వాదనలు చేయకండి. మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేందుకు న్యాయస్థానాన్ని వేదికగా మార్చకండి’అని పేర్కొంది. ‘నాలుగు నెలల చిన్నారి ఆందోళనల్లో పాల్గొనేందుకు సొంతంగా వెళతాడా?. మాతృత్వంపై మాకు అత్యున్నత గౌరవం ఉంది. చిన్నారుల క్షేమం గురించి ఆలోచిస్తాం. ఇలాంటి వాదనలతో అపరాధభావం మరింతగా పెంచకండి. నిరసనల్లో పాల్గొని చిన్నారులకు మరిన్ని ఇబ్బందులు కలిగించరాదని తల్లులు గ్రహించాలి’అని ధర్మాసనం పేర్కొంది.

షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న తల్లితోపాటుగా ఉన్న నాలుగు నెలల చిన్నారి జనవరి 30వ తేదీ రాత్రి నిద్రలోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. మరో పరిణామం.. షహీన్‌బాగ్‌లోని ప్రభుత్వ రహదారిపై చేపట్టిన నిరసనల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ట్రాఫిక్‌ సజావుగా సాగేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘నిరసనలు తెలిపే హక్కు ప్రజలకుంది. అయితే, కీలకమైన అలాంటి ప్రాంతంలో సుదీర్ఘకాలం ఆందోళనలు సాగించడం తగదు. ప్రభుత్వ రహదారులు, పార్కుల వద్ద కాకుండా ప్రత్యేకించిన ప్రాంతాల్లోనే వారు నిరసనలు చేపట్టాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు’అని పేర్కొంది. డిసెంబర్‌ 15వ తేదీ నుంచి కాళిందికుంజ్‌–షహీన్‌బాగ్‌ రహదారిపై కొనసాగుతున్న నిరసనలపై స్పందించాలని కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పోలీసులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు