ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణపై స్టేకు సుప్రీం నిరాకరణ

24 Jan, 2019 13:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద నిందితుడికి ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ తీసుకువచ్చిన ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్ట సవరణ, 2018పై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్ధానం గురువారం నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణను సవాల్‌ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను, మార్చి 20న ఈ అంశంపై సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్లను కలిపి విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఈ చట్టాన్ని నిర్వీర్వం చేస్తుందనే ఆందోళనతో గత ఏడాది ఆగస్ట్‌ 9న ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ చట్టం తీవ్రంగా దుర్వినియోగమవుతుందంటూ దీనికి సంబంధించిన ఫిర్యాదులపై తక్షణ అరెస్ట్‌లను నిలువరించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చుతూ ప్రభుత్వం నూతన సవరణలు చేపట్టింది.

కాగా ఎస్సీ,ఎస్టీ వేధింపుల చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగిపై దాఖలైన కేసుల్లో నిర్ధిష్ట అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే అరెస్ట్‌ చేయాలనే నిబంధనలు సహా సుప్రీం కోర్టు పలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిని పరిష్కరిస్తూ ఈ చట్టానికి కోరలు తెచ్చేలా పార్లమెంట్‌లో ప్రభుత్వం సంబంధిత చట్టానికి నూతన సవరణలు ప్రతిపాదించింది.

మరిన్ని వార్తలు