ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టేకు సుప్రీం నో

30 Jan, 2019 12:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టే జారీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరించింది. ఈ చట్టం కింద నిందితులకు ముందస్తు బెయిల్‌ నిరాకరించడాన్ని తిరిగి చట్టంలో జోడిస్తూ తీసుకువచ్చిన సవరణలపై స్టే ఇవ్వాలన్న అప్పీల్‌ను నిలిపివేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు గతంలో వెలువరించిన తీర్పుపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌తో పాటు అన్ని అంశాలను ఫిబ్రవరి 19న విచారణ చేపడతామని న్యాయస్ధానం వెల్లడించింది.

ఈ అంశాన్ని లోతుగా విచారించాల్సిన అవసరం ఉన్నందున దీనికి సంబంధించిన అన్ని అంశాలను వచ్చే నెల 19న వాద, ప్రతివాదనలను కోర్టు పరిశీలిస్తుందని జస్టిస్‌ యూయూ లలిత్‌ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ పేర్కొంది. చట్టానికి చేసిన మార్పులను తక్షణమే నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదించగా, ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద విచారణ లేకుండానే అరెస్టులు వద్దంటూ గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ చట్టాన్ని బలోపేతం చేస్తూ గత ఏడాది ఆగస్ట్‌ 9న పార్లమెంట్‌ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక సవరణ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు