ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టేకు సుప్రీం నో

31 Jan, 2019 15:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ఈ చట్టం కింద నిందితులకు ముందస్తు బెయిల్‌ నిరాకరించడాన్ని తిరిగి చట్టంలో చేర్చాలని వచ్చిన పిటిషన్‌పై స్టే విధించడం కుదరదని మరోసారి స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్, తదుపరి వాదనలపై ఫిబ్రవరి 19న విచారణ చేపడతామని జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై లోతైన విచారణ జరపాల్సిన అవసరమున్నందున అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది.

ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలను వెంటనే నిలిపి వేయాలని పిటిషనర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదనలపై ధర్మాసనం ఈమేరకు స్పందించింది. కాగా, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం–2018 కింద నిందితులకు ఎలాంటి ముందస్తు బెయిల్‌ నిరాకరించరాదని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పార్లమెంటు ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణల బిల్లుకు గతేడాది ఆగస్టు 9న ఆమోదం తెలిపింది.

మరిన్ని వార్తలు