మాస్టర్‌ రోస్టర్‌ సీజేఐనే: సుప్రీం

7 Jul, 2018 02:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘మాస్టర్‌ రోస్టర్‌’ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)నే అని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. విశేషాధికారాలతోపాటు వివిధ ధర్మాసనాలకు కేసులను కేటాయించే అధికారం సీజేఐదేనని తేల్చి చెప్పింది. కేసుల కేటాయింపులో ప్రస్తుతం అనుసరిస్తున్న రోస్టర్‌ విధానాన్ని సవాల్‌ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బెంచ్‌.. ‘సమానుల్లో ప్రథముడు సీజేఐ, కోర్టు పరిపాలన వ్యవహారాల్లో నాయకత్వ బాధ్యతలను చేపట్టే అధికారం ఆయనకు ఉంది’ అని తెలిపింది. ‘మాస్టర్‌ రోస్టర్‌గా సీజేఐను పేర్కొనడంలో ఎలాంటి వివాదమూ లేదు.

సుప్రీంకోర్టులోని వివిధ బెంచ్‌లకు కేసులను కేటాయించే అధికారం ఆయనకు ఉంది’ అని జస్టిస్‌ ఏకే సిక్రీ తన తీర్పులో పేర్కొన్నారు. జస్టిస్‌ భూషణ్‌ కూడా తన తీర్పులో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘కేసులను కేటాయించడంతోపాటు వివిధ ధర్మాసనాలకు ఆ బాధ్యతలను అప్పగించే విశేషాధికారం సీజేఐకు ఉంది. సుప్రీంకోర్టు పాటిస్తున్న ప్రమాణాలు, పద్ధతులు కాలపరీక్షకు తట్టుకుని నిలబడ్డాయి. ఇప్పుడు వాటిని మార్చకూడదు. సుప్రీంకోర్టులో సీనియర్‌ మోస్ట్‌ జడ్జి  ప్రధాన న్యాయమూర్తి. ఆయనే అధికార ప్రతినిధి, న్యాయవ్యవస్థకు నాయకుడు’ అని పేర్కొన్నారు. సీజేఐకి కేసుల కేటాయింపులో విశేషాధికారాలు ఉండరాదనీ, కేసుల కేటాయింపు బాధ్యతను సుప్రీంకోర్టులోని ఐదుగురు సీనియర్‌ జడ్జిలతో కూడిన బెంచ్‌కు అప్పగించాలని శాంతి భూషణ్‌ తన పిల్‌లో కోరారు.

>
మరిన్ని వార్తలు