అయోధ్య వివాదం విచారించలేం : సుప్రీంకోర్టు

12 Nov, 2018 12:35 IST|Sakshi

ముందస్తు విచారణకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం

హిందూ మహాసభ దాఖలు చేసిన పటిషన్‌ కొట్టివేత

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య భూవివాదంపై ముందస్తు విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అయోధ్యపై హిందూ మహాసభ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ముందస్తుగా విచారించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలో ధర్మాసనం సోమవారం తేల్చిచెప్పింది. దీనిపై  ఇదివరకే సుప్రీంకోర్టు పలు మార్గదర్శలను విడుదల చేసిందని, దాని ప్రకారమే వచ్చే ఏడాది జనవరిలో ప్రత్యేక ధర్మాసనం ద్వారా విచారణ చేపడతామని సీజే వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుపై పలు హిందూ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

కాగా 2010లో అలహాబాద్‌ హైకోర్టు అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిని మూడు భాగాలుగా విభజించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు 14 పిటిషన్లు దాఖలు అయినట్లు కోర్టు తెలిపింది. వీటన్నింటినీ కలిపి జనవరిలో విచారిస్తామని సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. ఇదిలావుండగా యూపీలో బీజేపీ ప్రభుత్వం కోర్టు తీర్పుతో ఎలాంటి సంబంధం లేకుండా పార్లమెంట్‌ ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే శితాకాల సమావేశంలో ఆర్డినెన్స్‌ తీసుకురావాలని యూపీ బీజేపీశాఖ ప్రయత్నిస్తోంది.   

మరిన్ని వార్తలు