నిర్భయ దోషికి మరణ శిక్షే

19 Dec, 2019 02:53 IST|Sakshi

అక్షయ్‌ రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అక్షయ్‌ కుమార్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ ఆర్‌.బానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఏఎస్‌ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్షకు ఎలాంటి ఆధారాలు లేవని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.

అక్షయ్‌కు మరణశిక్షను ధ్రువీకరిస్తూ తీర్పు వెలువరించింది. గత ఏడాది జులై 9న ఈ కేసులో మరో ముగ్గురు దోషులు ముఖేష్, పవన్‌గుప్తా, వినయ్‌ శర్మల రివ్యూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. వారి రివ్యూ పిటిషన్లకి, అక్షయ్‌ పిటిషన్‌కి ఎలాంటి తేడా లేదని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. దీంతో అక్షయ్‌ తరపు లాయర్‌ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడానికి మూడు వారాల గడువివ్వాలని కోరారు.  రాజకీయపరమైన, మీడియా ఒత్తిళ్ల వల్లనే తన క్లయింట్‌ను దోషిగా తేల్చారని ఆరోపించారు. ఇక దోషులకు న్యాయ పరంగా  క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేసుకునే  అవకాశం మాత్రం మిగిలుంది.

డెత్‌ వారెంట్లపై విచారణ 7కి వాయిదా
నిర్భయ దోషులు ఉరిశిక్షపై రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుకుంటారో లేదో వారంలోగా వారి స్పందనను  తెలుసుకోవాలని ఢిల్లీ కోర్టు తీహార్‌ జైలు అధికారుల్ని ఆదేశించింది. డెత్‌ వారెంట్లు జారీపై విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది.  

మహారాష్ట్రలోనూ ‘దిశ’ తరహా చట్టం
నాగపూర్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మహిళల భద్రతకు సంబంధించి యావత్‌ జాతికి దిశానిర్దేశం చేసేలా తీసుకువచ్చిన దిశ చట్టంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దిశ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. దిశ చట్టం ఎంత శక్తిమంతమైనదో గ్రహించిన మహా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ బాటలో నడవాలని యోచిస్తోంది. మహిళల అకృత్యాలపై 21 రోజుల్లోగా విచారణ జరిపి, అత్యాచారం కేసుల్లో మరణ దండన విధించాలని దిశ చట్టం చెబుతోంది.

ఈ తరహాలోనే చట్టం చేయాలని భావిస్తున్నట్లు హోం మంత్రి ఏక్‌నాథ్‌ షిండే బుధవారం శాసన మండలిలో చెప్పారు. ‘మహిళలపై అకృత్యాల విషయంలో చట్టాలను అమలు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం తరహాలో సత్వర న్యాయం కోసం ఒక కొత్త చట్టం తీసుకువచ్చే ఆలోచన ఉంది’ అని హోం మంత్రి వెల్లడించారు. మహిళలు, చిన్నారులపై రోజు రోజుకి పెరిగిపోతున్న నేరాల విషయంలో విపక్షాలిచ్చిన సావధాన తీర్మానానికి హోం మంత్రి ఈ మేరకు బదులిచ్చారు.  

బిహార్‌లో మరో ఘోరం
ససారం:  బిహార్‌లోని రోహ్తాస్‌ జిల్లాలో ఓ దళిత మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి యత్నించగా ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం  మంగళవారం రాత్రి బాధితురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడింది.  నిందితులను ఆదివారమే అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడించారు.   కాల్పులు జరిపిన వారికోసం గాలిస్తున్నామన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా