వలస జీవుల కష్టాలు తీర్చండి! 

27 May, 2020 04:11 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయాలనీ, వారికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలను కల్పించాలనీ కేంద్రాన్నీ, రాష్ట్రప్రభుత్వాలను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోరింది. కోవిడ్‌–19 లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల సమస్యలనూ, వారి కష్టాలను పరిశీలించిన సుప్రీంకోర్టు కేసుని సుమోటోగా స్వీకరించింది. కేంద్రం, రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలు పరిస్థితిని చక్కదిద్దేందుకు వలసకార్మికుల సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో మే 28లోగావిన్నవించాలని జస్టిస్‌ అశోక్‌భూషణ్, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదావేసింది.  మీడి యా, పత్రికల్లో వచ్చిన కథ నాలను ప్రస్తావిస్తూ ధర్మా సనం..వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాల తరఫున లోపాలు జరిగాయని భావిస్తున్నట్లు తెలిపింది.

కార్మికుల వేతనాలు అత్యవసర అంశం
లాక్‌డౌన్‌ కాలంలో పూర్తి వేతనాలు చెల్లించే అంశాన్ని అత్యవసర విషయంగా పరిగణించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. లాక్‌డౌన్‌ కాలంలో పూర్తి వేతనాలు చెల్లించాలంటూ మార్చి 29న హోం శాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు పై విధంగా స్పందించింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌లపై కేంద్ర ప్రభుత్వం తన స్పందనను దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు