షహిన్‌బాగ్‌ ఆందోళనలపై సుప్రీం ఆగ్రహం

17 Feb, 2020 16:01 IST|Sakshi

నిరసనకారులతో చర్చలకు మధ్యవర్తిత్వం ఏర్పాటు

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద చట్టాలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం  తీవ్రంగా స్పందించింది. నిరసనలు తెలిపే హక్కు ప్రజలకుందని, అయితే రోజుల తరబడి రోడ్లను బ్లాక్‌ చేయడం సరికాదని  ఆగ్రహం వ్యక్తం చేసింది. షహిన్‌బాగ్‌ ప్రాంతాన్ని ఖాళీ చేసేలా ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది అమిత్‌ సైనీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

‘‘నిరసనలు తెలిపే హక్కు ప్రజలకుంది. అయితే, కీలకమైన అలాంటి ప్రాంతంలో సుదీర్ఘకాలం ఆందోళనలు సాగించడం తగదు. ప్రభుత్వ రహదారులు, పార్కుల వద్ద కాకుండా ప్రత్యేకించిన ప్రాంతాల్లోనే వారు నిరసనలు చేపట్టాలి. షహిన్‌బాగ్‌ ఆందోళనల పట్ల ఓ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతరులకు ఇబ్బంది కలిగకుండా నిరసన తెలిపిందుకు మరో ప్రాంతాన్ని ఎంచుకోండి’ అని సుప్రీం స్పష్టం చేసింది.

అలాగే నిరసనకారులతో మట్లాడేందుకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు సంజయ్‌ హేగ్డే, సాధన రామచంద్రన్‌లను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసింది. షహిన్‌బాగ్‌ను ఖాళీ చేసే విధంగా వారితో సంప్రదింపులు జరపాలని న్యాయస్థానం కోరింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దేశంలో మరో 5వేల షహిన్‌బాగ్‌ కేంద్రాలు ఏర్పాటు అవుతాయంటూ.. భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా ధర్మాసనం స్పందించింది. వాటితో తమకు ఎలాంటి ఇబ్బందిలేదని కానీ పౌరుకుల అసౌకర్యం కలగకుండా నిరసన తెలుపుకోవాలని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు