షహీన్‌బాగ్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

10 Feb, 2020 14:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే రహదారిని ఎలా దిగ్భందిస్తారని షహీన్‌బాగ్‌ నిరసనలను ఉద్దేశించి సర్వోన్నత న్యాయస్దానం ప్రశ్నించింది. షహీన్‌బాగ్‌ నుంచి నిరసనకారులను ఖాళీ చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ సందర్భంగా నిరసనల్లో పాల్గొంటూ చలిని తాళలేక నాలుగు నెలల చిన్నారి మృత్యువాతన పడటంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అసలు ఆ ప్రాంతానికి చిన్నారి ఎలా చేరుకుందని కోర్టు ప్రశ్నించింది.

ఈ అంశాన్ని కోర్టు సుమోటోగా పరిగణనలోకి తీసుకోవడంపై కొందరు న్యాయవాదులు వ్యతిరేకించడం పట్ల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ఇక షహీన్‌బాగ్‌పై తక్షణమే ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. ఆందోళనకారులు రోడ్డును బ్లాక్‌ చేసి ఇతరులకు అసౌకర్యం కలిగించరాదని సుప్రీంకోరు ​స్పష్టం చేసింది. కాగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గత యాభై రోజులుగా షహీన్‌బాగ్‌ కేంద్రంగా పెద్దసంఖ్యలో మహిళలు, చిన్నారులు నిరవధిక ధర్నాను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి : ‘షాహీన్‌ బాగ్‌.. సుసైడ్‌ బాంబర్ల శిక్షణ కేంద్రం’

మరిన్ని వార్తలు