జర్నలిస్ట్‌లకు ఊరట; కోర్టు లోపలికి మొబైల్‌ ఫోన్‌

3 Jul, 2018 08:50 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి విలేకరులను కోర్టు హాల్‌ లోపలికి మొబైల్‌ ఫోన్‌ను తీసుకెళ్లడానికి అనుమతిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది.  నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ సర్క్యులర్‌ అక్రిడేషన్‌, నాన్‌-అక్రిడేషన్‌ జర్నలిస్టులదరికీ వర్తించనుంది.

సర్క్యులర్‌ లోని సమాచారం ప్రకారం.. ‘అక్రిడేషన్‌, నాన్‌ - అక్రిడేషన్‌ జర్నలిస్టులు ఎవరైనా కోర్టు హాల్‌ లోపలికి మొబైల్‌ ఫోన్లు తీసుకెళ్లవచ్చు. అయితే జర్నలిస్ట్‌లు కోర్టు హాల్‌ లోపలికి మొబైల్‌ ఫోన్స్‌ తీసుకెళ్లాంటే వారి వద్ద తప్పకుండా రిజిస్ట్రీ వారు ఇచ్చిన పాస్‌ ఉండాలి. ఈ పాస్‌ కాల వ్యవధి కేవలం ఆరు నెలలు మాత్రమే. అయితే కోర్టు హాల్‌లోకి మొబైల్‌ ఫోన్‌ను తీసుకెళ్లినప్పటికి, దాన్ని ‘సైలెంట్‌ మోడ్‌’లోనే ఉంచాలి. అలా కాకుండా కోర్టు కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తే రిజిస్ట్రీ వారు సదరు వ్యక్తి ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటారు. అంతేకాక ఈ నియమాలను ఉల్లఘించినందుకు గాను జరిమాన లేదా శిక్ష విధిస్తార’ని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

మే నెలలోనే జారీ అయిన ఈ సర్క్యులర్‌లో మొదట కేవలం అక్రిడేషన్‌ ఉన్న జర్నలిస్టులను మాత్రమే కోర్టు హాల్‌ లోపలికి మొబైల్‌ ఫోన్స్‌ తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. కానీ కొందరు మీడియా వ్యక్తులు, జర్నలిస్టులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అక్రిడేషన్‌ ఉన్న వారికే కాక నాన్‌ అక్రిడేషన్‌ జర్నలిస్ట్‌లను కూడా కోర్టు హాల్‌ లోపలికి మొబైల్‌ ఫోన్‌ను తీసుకువచ్చేందుకు అనుమతించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాను కోరారు. అందుకు ప్రధాన న్యాయమూర్తి ఒప్పుకోవడంతో నూతన సర్క్యులర్‌ను జారీ చేశారు. అయితే కోర్టు లోపల జరిగే ప్రోసిడింగ్స్‌ను రికార్డు చేయడం, వీడియో తీయడంపై నిషేధం ఉందని సీనియర్‌ లాయర్‌ ఒకరు తెలిపారు. 

ఈ విషయం గురించి సినీయర్‌ జర్నలిస్ట్‌ ఒకరు స్పందిస్తూ.. ‘ఇన్నాళ్లూ​  కోర్టు హల్‌ లోపల జరుగుతున్న విషయాలను జాగ్రత్తగా విని, తీర్పుల సారాంశాన్ని వార్తల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మొబైల్స్‌ తీసుకెళ్లడానికి అనుమతి లేకపోవడం వల్ల సమాచారాన్ని వెంటనే అందివ్వడానికి కాస్తా ఇబ్బందిగా ఉండేది. కానీ నేటి నుంచి ఇలాంటి ఇబ్బందులు తొలగిపోనున్నాయ’నిఅన్నారు. గతంలో కేవలం న్యాయవాదులు మాత్రమే కోర్టు హాల్‌లోపలికి మొబైల్‌ ఫోన్స్‌ను తీసుకెళ్లడానికి అనుమతించేవారు.

మరిన్ని వార్తలు