ఇలా అయితే ఇక్కడ ఎవరూ బతకలేరు..

6 Aug, 2018 20:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని వ్యర్థాల్లో కూరుకుపోయి ఎమర్జెన్సీ పరిస్థితిని ఎదుర్కొంటోందని సర్వోన్నత న్యాయస్ధానం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యర్థాల నిర్వహణపై సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ఎవరైనా సజీవంగా ఉంటారా అని సుప్రీం కోర్టు నిలదీసింది. ఘన వ్యర్థాల నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపడతారో వివరించాలని అధికారులను కోరింది.

డిఫెన్స్‌ కాలనీ, గ్రీన్‌ పార్క్‌ వంటి ప్రాంతాల్లో చేపట్టిన ఘన వ్యర్థాల నిర్వహణ పైలట్‌ ప్రాజెక్టు వివరాలు సమర్పించాలని జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాతో కూడిన సుప్రీం బెంచ్‌ అధికారులను ఆదేశించింది. ఢిల్లీలో ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిష్కారం లేకపోవడం దురదృష్టకరమని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ)ను ఉద్దేశించి బెంచ్‌ వ్యాఖ్యానించింది.

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం ఉన్న ప్రాంతాన్నే డంప్‌ యార్డుగా మలచడం పట్ల మండిపడింది. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి రాజధాని ప్రాంతంలో వ్యర్థాలన్నింటినీ చెత్త నుంచి ఇంధన తయారీ, ప్రాసెసింగ్‌ ప్లాంట్లకు తరలించే ఏర్పాట్లు చేపడతామని ఏఎస్‌జీ కోర్టుకు నివేదించారు.

మరిన్ని వార్తలు