మాతృభాష తప్పనిసరి కాదు

7 May, 2014 01:50 IST|Sakshi
మాతృభాష తప్పనిసరి కాదు

* బోధనా భాషను ఎంచుకునే అధికారం తల్లిదండ్రులకు ఉంటుందని స్పష్టీకరణ
* కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేసిన రాజ్యాంగ ధర్మాసనం

 
 న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు:
ప్రాథమిక విద్యాభ్యాసానికి గాను పాఠశాల ల్లో మాతృభాషను ప్రభుత్వం తప్పనిసరి చేయజాలదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భాషాపరమైన అల్ప సంఖ్యాకులపై బలవంతంగా స్థానిక మాతృ భాషను రుద్ద కూడదని తెలిపింది. రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు ఇది విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. ప్రాథమిక విద్యను నేర్చుకునేందుకు మాతృ భాషను తప్పనిసరి చేయడం ద్వారా ఒత్తిడి తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది.  
 
 ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు విధిగా కన్నడ మీడియంలోనే బోధించాలని  1994లో కర్ణాటక ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు సవాలు చేశాయి. హైకోర్టులో వారికి అనుకూలంగా తీర్పు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తొలుత ఇద్దరు సభ్యుల సుప్రీం బెంచ్ ముందుకు ఈ అంశం వచ్చింది. సదరు బెంచ్ గత ఏడాది జూలైలో.. పిల్లల అభ్యున్నతిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుందని తెలియజేసింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న అంశం ప్రస్తుత తరమే కాకుండా భవిష్యత్ తరాల ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది.
 
 ఈ నేపథ్యంలోనే చీఫ్ జస్టిస్ లోధా నేతృత్వంలో న్యాయమూర్తులు ఎ.కె.పట్నాయక్, ఎస్.జె.ముఖోపాధ్యాయ, దీపక్ మిశ్రా, ఎస్.ఎం.ఐ.కలీఫుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. రాజ్యాంగంలోని 350 ఏ ప్రకారం.. కేవలం మాతృభాషనే బోధనా మాధ్యమంగా ఎంచుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేయజాలదని పేర్కొంటూ తీర్పు చెప్పింది. విద్యార్థికి మరింత ప్రయోజనకరమనే కారణంతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా బలవంతం చేయజాలదని స్పష్టం చేసింది. మాతృభాషను తప్పనిసరి చేయడం విద్యా ప్రమాణాలపై ఏ విధంగానూ ప్రభావం చూపించదని, పైగా రాజ్యాంగంలోని అధికరణాలు 19(1)(ఏ), 19(1)(జీ) కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు ప్రభావం చూపుతాయని ధర్మాసనం పేర్కొంది. ప్రాథమిక పాఠశాలలో బోధన కోసం భాషను ఎంచుకునే అధికారం తల్లిదండ్రులకు ఉంటుందని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు