దుబే ఎన్‌కౌంటర్‌: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

14 Jul, 2020 18:13 IST|Sakshi

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్‌ సహా అంతకుముందు అతడి గ్యాంగ్‌ చేతిలో ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసుల దర్యాప్తునకై రిటైర్డు జడ్జి నేతృత్వంలో విచారణ కమిటీ నియమించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ రెండు ఘటనలపై కేంద్ర సంస్థల చేత దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను గురువారం లోగా అందజేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. (దూబే ఎన్‌కౌంటర్‌: ఓ రోజు ముందుగానే పిటిషన్‌!)

అదే విధంగా.. ‘‘తెలంగాణ కేసు మాదిరిగా ఈ కేసులో కూడా.. విచారణ జరిపించాలని యోచిస్తున్నాం. మీకు ఏ రకమైన కమిటీ కావాలో చెప్పండి’’ అని పిటిషనర్లను ఉద్దేశించి సీజేఐ ఎస్‌ఏ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు తరఫున వాదిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు వెలికితీసి కోర్టుకు తెలియజేసేందుకు తమకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా..  దుబే ఎన్‌కౌంటర్‌పై విచారణకై యూపీ సర్కారు ఇప్పటికే ఏకసభ్య స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. (వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్: అనేక అనుమానాలు!)

కాగా ఉత్తరప్రదేశ్‌లో నేర సామ్రాజ్యం నిర్మించుకున్న వికాస్‌ దుబేను కాన్పూర్‌లోని బిక్రూ గ్రామంలో అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై.. జూలై 2 అర్ధరాత్రి అతడి గ్యాంగ్‌ విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడిన విషయం విదితమే. ఈ ఘటనలో డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు నేలకొరిగారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన వికాస్‌ దుబే అనేక నాటకీయ పరిణామాల మధ్య మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిలోని ప్రముఖ ఆలయంలో పోలీసుల చేతికి చిక్కాడు. అక్కడి నుంచి అతడిని కాన్పూర్‌కు తీసుకువచ్చే క్రమంలో జూలై 10న పోలీసుల వాహనం బోల్తా పడింది. ఈ నేపథ్యంలో పారిపోవడానికి ప్రయత్నించిన దుబే తమపై కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్‌ చేసినట్లు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ వెల్లడించింది. అయితే అనేక మంది బడా నాయకులు, పోలీసులతో ఈ గ్యాంగ్‌స్టర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. తమ రహస్యాలు బయటపెడతాడనే భయంతోనే అతడిని హతమార్చారంటూ ప్రతిపక్షాలు సహా అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. 

ఇక దుబే ఎన్‌కౌంటర్‌ కంటే ముందే అతడి అనుచరులు ఐదుగురు ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన న్యాయవాది ఘన్‌శ్యామ్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దుబే గ్యాంగ్‌ సభ్యుల మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థచేత విచారణ జరిపించాలని కోరారు. అంతేగాక దుబే కూడా ఎన్‌కౌంటర్‌ అయ్యే అవకాశం ఉందని పిల్‌లో అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు.. అనూప్‌ ప్రకాశ్‌ అవస్థి అనే వ్యక్తి పోలీసులపై దుబే గ్యాంగ్‌ అరాచకంపై సీబీఐ లేదా ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు.. విచారణ
ఈ పిటిషన్లను విచారించిన కోర్టు.. తెలంగాణలో జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసును ఈ సందర్భంగా గుర్తుచేసింది. రంగారెడ్డి జిల్లాలోని దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారని, అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిటైర్డు జడ్జి జస్టిస్‌ వికాస్‌ శ్రీధర్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా ప్రకాశ్‌, సీబీఐ మాజీ చీఫ్‌ కార్తికేయన్‌ ఇందులో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ఆరు నెలల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించగా కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ విషయంలో జాప్యం నెలకొంది.

మరిన్ని వార్తలు