కోటీశ్వరులు పారిపోతుంటే.. రైతులకు శిక్షా?

12 Apr, 2016 14:06 IST|Sakshi
కోటీశ్వరులు పారిపోతుంటే.. రైతులకు శిక్షా?

వేలాది కోట్లు మూటగట్టుకున్నవాళ్లు విదేశాలకు పారిపోతుంటే, రైతులకు మాత్రం జరిమానాలు వేస్తున్నారంటూ రిజర్వు బ్యాంకుపై సుప్రీంకోర్టు మండిపడింది. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో రుణాలు బాకీపడిన రైతుల ఇళ్లకు బ్యాంకులు సిబ్బందిని పంపి ట్రాక్టర్లు సీజ్ చేయిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. రిజర్వు బ్యాంకు ఎప్పుడూ వాచ్‌డాగ్‌లా పనిచేయాలని చెప్పింది. ప్రముఖ న్యాయవాది ప్రశాంతభూషణ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడం, అవన్నీ చావుబాకీలుగా మారిన నేపథ్యంలో దానికి బాధ్యులైనవారిని గుర్తించి శిక్షించాలని ప్రశాంత భూషణ్ తన పిటిషన్‌లో కోరారు.

అంతకుముందు రూ. 500 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తంలో బాకీలున్న వ్యక్తులు, సంస్థల జాబితాను కోర్టుకు సమర్పించి, ఆ పేర్లను రహస్యంగా ఉంచాలని కోరింది. ఆ మొత్తం ఎంతో బయటపెట్టొచ్చా అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, దానివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆర్‌బీఐ తెలిపింది. రూ. 500 కోట్ల క్లబ్బులో ఉన్నవాళ్ల పేర్లు బయటపెట్టాలని ప్రశాంతభూషణ్ కోరారు. అలా బయటపెడి తే ప్రస్తుతమున్న నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందా అని ఆర్థిక మంత్రిత్వశాఖ, బ్యాంకులు వివరించాలని సుప్రీం తెలిపింది. 2013-2015 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో 28 ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు రూ. 1.14 లక్షల కోట్లను చావుబాకీలుగా నిర్ధారించి రద్దుచేశాయి.

>
మరిన్ని వార్తలు