పూరీ జగన్నాథ రథయాత్రపై సుప్రీం స్టే

18 Jun, 2020 13:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పూరీ జగన్నాథ రథయాత్రపై సందిగ్ధత వీడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో యాత్ర నిర్వహణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ రథయాత్ర నిర్వహిస్తే ఆ దేవుడే మనల్ని క్షమించడు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు భారతీయ వికాస్‌ పరిషత్‌ (బీవీపీ) దాఖలు చేసిన స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌పై గురువారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. భౌతిక దూరం నిబంధనకు ప్రాధాన్యం కల్పించేందుకు యాత్ర నిర్వహణలో యాంత్రిక శక్తి, ఏనుగుల వినియోగం పట్ల హైకోర్టు మొగ్గం చూపడం ఆలయ సంప్రదాయ, చట్ట వ్యతిరేకమని బీవీపీ కోర్టుకు వివరించింది. (ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం)

పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పూరీజగన్నాథ రథయాత్రపై స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. కాగా విపత్కర పరిస్థితుల్లో జగన్నాథుని రథయాత్ర పలుమార్లు నిలిపి వేసినట్లు చారిత్రాత్మక దాఖలాలు ఉన్నాయి. గడిచిన 452 ఏళ్లలో 32 సార్లు వాయిదా పడినట్లు పిటిషినర్‌ సంస్థ అధ్యక్షుడు సరేంద్ర పాణిగ్రహి సుప్రీంకోర్టును వివరించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో రాష్ట్రమంత్రి మండలి గురువారం సాయంత్రం భేటీ కానున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు