ఆ కాలనీల్లో నిర్మాణాలు బంద్‌

24 Apr, 2018 17:51 IST|Sakshi
దేశ రాజధానిలో అక్రమ నిర్మాణాలను నిలిపివేసిన సుప్రీం

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని 1797 అనధికార కాలనీల్లో నిర్మాణాలపై సుప్రీం కోర్టు మంగళవారం స్టే విధించింది. అనధికార కాలనీల్లో భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా సాగే నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. జాతీయ రాజధానిలో రహదారులు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఢిల్లీ మాస్టర్‌ప్లాన్‌కు ప్రతిపాదిత సవరణలపై విధించిన స్టేను ఎత్తివేయాలన్న ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అనధికార కాలనీల్లో భవనాలు, నిర్మాణాలు మున్సిపల్‌ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడాలన్న సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ వాదనతో కోర్టు ఏకీభవించింది. ​కాగా దేశ రాజధానిలో నివాస ఆస్తులను వ్యాపార సముదాయాలుగా మార్చిన వాణిజ్య సంస్థలపై కొరడా ఝళిపిస్తూ కోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీ సీలింగ్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమైనందునే పరిస్థితి దిగజారిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు