కిల్లర్ కోలీ మరణ శిక్షపై సుప్రీం కోర్టు స్టే

8 Sep, 2014 09:56 IST|Sakshi
కిల్లర్ కోలీ మరణ శిక్షపై సుప్రీం కోర్టు స్టే

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారి వరుస హత్యల కేసు దోషి  సురీందర్ కోలీకి తాత్కాలిక వూరట లభించింది. కోలీ మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నోయిడాలోని 14 ఏళ్ల బాలిక రింపా హాల్దర్‌ను దారుణంగా హతమార్చిన కేసులో కోలీకి ఉరిశిక్ష పడింది. మీరట్ జైల్లో అతడిని 12వ తేదీన ఉరి తీసేందుకు రంగం సిద్ధం అయిన విషయం తెలిసిందే.


కాగా కోలీ మరణ శిక్ష అమలుపై న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తూ వారం రోజుల పాటు స్టే విధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో సురేందర్ కోలీకి వేసిన ఉరిశిక్ష అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముంది. ఉరిశిక్ష అమలుపై అతడు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు పరిశీలించి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సిఫారసు మేరకు 42 ఏళ్ల సురిందర్ కోలి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 27న తిరస్కరించారు.కాగా కోలిపై మరో 11 హత్యకేసులు పెండింగ్‌లో ఉన్నాయి.  కోలీపై మొత్తం 16 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. 2006లో రింపా హాల్దర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో నోయిడా శివార్లలోని నిఠారి ప్రాం తంలో కోలీ పనిచేసే ఇంటిపక్కనున్న మురికి కాలువలో పలువురు చిన్నారుల అస్థిపంజరాల శిథిలాలు లభించాయి. కోలీకి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను అలహాబాద్ హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టు సమర్ధించాయి.

>
మరిన్ని వార్తలు