అనుమతిస్తే దేవుడు కూడా క్షమించడన్న చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ/భువనేశ్వర్: జూన్ 23న ప్రారంభం కానున్న చారిత్రక పూరి జగన్నాథ్ రథయాత్ర, దాని అనుబంధ కార్యకలాపాలను కోవిడ్ కారణంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ‘ఒక వేళ రథయాత్ర జరిపితే జగన్నాథుడు మనల్ని క్షమించడు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యం కోసం ఈ ఏడాది ఒడిశాలోని పూరిలో రథయాత్రకు అనుమతించడం లేదని చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలోని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. రథయాత్రకు అనుమతిస్తే ఆ దేవుడు క్షమించడని చీఫ్ జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు.
కరోనా వ్యాప్తి కారణంగా పూరీసహా రాష్ట్రంలో మరెక్కడా రథయాత్రలు నిర్వహించకుండా కట్టడిచేయాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి రథయాత్రకు అనుమతిస్తే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడతారనీ, ఈ కరోనా సమయంలో ఇది అత్యంత ప్రమాదకరమని వాదించారు. ఇది చాలా సీరియస్ అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందించేందుకు రేపటి వరకు సమయం కావాలని కోర్టును కోరారు. అయితే ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం జూన్ 30 వరకు ఎక్కువమంది ప్రజలు ఒక చోట హాజరు కాకూడదని ప్రకటించింది. ఎట్టకేలకు జూన్ 23న ప్రారంభం కానున్న రథయాత్రను కోర్టు నిలిపివేసింది.