సీబీఐ డైరెక్టర్‌కి సుప్రీం సమన్లు

27 Jul, 2018 18:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మణిపూర్‌ నకిలీ ఎన్‌కౌంటర్లపై విచారణలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ వర్మకు శుక్రవారం సమన్లు జారీ చేసింది. మణిపూర్‌ నకిలీ ఎన్‌కౌంటర్లపై విచారణ ఎందుకు ఆలస్యం జరుగుతోందో తగిన కారణాలను జూలై 30 లోపు తన ముందుంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ ప్రకియను వేగవంత చేయడానికి సంస్థ అనుసరించే విధానం ఏమిటో తనకు తెలపాలని న్యాయస్థానం సీబీఐని కోరింది.

భారత సైన్యం, అస్సాం రైఫిల్స్‌, మణిపూర్‌ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్ల్‌పై 2016లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైన విషయం తెలిసిందే.  సాయుధ దళాలు ప్రత్యేక అధికారాల చట్టం (ఎస్‌ఎఫ్‌ఎస్‌పీఏ) అమలులో ఉన్న మణిపూర్‌లో గడిచిన పదేళ్లల్లో 1528 నకిలీ ఎన్‌కౌంటర్లు జరిపినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టీస్‌ మదన్‌ బీ లోకూర్‌, జిస్టీస్‌ యూ యూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఎన్‌కౌంటర్ల్‌పై విచారణ జరపవల్సిందిగా సీబీఐని ఆదేశించింది.

మణిపూర్‌లో సైన్యం, అస్సాం రైఫిల్స్‌, పోలీసుల బలగాలు పాల్పడిన మానవ హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నకిలీ ఎన్‌కౌంటర్లలో పౌరులు ప్రాణాలు కోల్పోయినందున తీవ్ర ప్రాముఖ్యత గల విషయంగా పరిగణిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.

మరిన్ని వార్తలు