సుప్రీంకోర్టు వేసవి సెలవులు రద్దు

15 May, 2020 18:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా విపత్తు నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి  సెలవులను సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎస్‌.ఎ. బోబ్డే సెల‌వుల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం మే 18 నుంచి జూన్‌ 19 వరకూ ఉన్నత న్యాయస్థానానికి వేసవి సెలవులు. అయితే కరోనా వైరస్‌ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అయిదు వారాల సెలవులలోనూ న్యాయస్థానం పని చేయనుంది. సెల‌వుల ర‌ద్దుతో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

కాగా లాక్‌డౌన్ వ‌ల్ల ఇప్ప‌టికే ప‌ని దినాల‌ను కోల్పోయామని, కాబ‌ట్టి వేస‌వి సెల‌వు‌లను త‌గ్గిస్తూ, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కేసుల‌ను విచారించాల‌ని జ‌స్టిస్ ఎల్ఎన్ రావుతో కూడిన‌ న్యాయ‌మూర్తుల క‌మిటీ సిఫార‌సు చేసిన విషయం తెలిసిందే. దీంతో భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం కేసుల విచార‌ణ కోసం ఐదు వారాల పాటు పని చేయనుంది. అలాగే క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఇతర న్యాయ సిబ్బందికి కూడా కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది. (సుప్రీంలో తొలిసారి ఏకసభ్య ధర్మాసనాలు)

మరిన్ని వార్తలు