అయోధ్య వాదనలు 18కల్లా ముగించండి

19 Sep, 2019 04:25 IST|Sakshi

ఇరు పక్షాలకు సూచించిన సుప్రీంకోర్టు

నవంబర్‌లో తుదితీర్పు వచ్చే అవకాశం

న్యూఢిల్లీ: భారత రాజకీయాలను ప్రభావితం చేయగల ‘రామ జన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదం’ కేసు తీర్పు నవంబర్‌లో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థల వివాదానికి సంబంధించి కేసులో ఇరు పక్షాల తరఫున వాదనలను అక్టోబర్‌ 18కల్లా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఇరుపక్షాలను ఆదేశించింది. దీంతో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ కేసు తీర్పు మరో రెండు నెలల్లో వెలువడనుంది. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా ఇరుపక్షాల వారు వివాదాన్ని పరిష్కరించుకోవాలనుకుంటే అందుకు తమకేమీ అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తేలి్చచెప్పింది.  

కీలక దశకు విచారణ
అక్టోబరు 18కల్లా రోజువారీ వాదనలను ఇరుపక్షాల లాయర్లు ముగిస్తే తుదితీర్పును రాయడానికి జడ్జీలకు 4వారాల సమయం పడుతుందని కోర్టు తెలిపింది. అంటే నవంబర్‌ మధ్యలోగా తీర్పు వెలువడొచ్చు. ఈ కేసును విచారిస్తున్న బెంచ్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్‌ గొగోయ్‌ సీజేఐగా అదే నెలలో 17వ తేదీన రిటైర్‌ కానున్నారు. వాదనలు పూర్తి చేసేందుకు అవసరమైన షెడ్యూల్‌ను తమకు సమర్పించాలని కేసులోని ఇరు పక్షాలకు ధర్మాసనం మంగళవారం సూచించింది.

కేసులో ఇరుపక్షాల రోజువారీ వాదనలు కొనసాగుతున్నాయని, విచారణ కీలకదశకు చేరుకుందని జడ్జీలు జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. మధ్యవర్తిత్వ ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టేందుకు కొంతమంది ఆసక్తి చూపారని, మధ్యవర్తిత్వం నెరిపిన త్రిసభ్య ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తున్న మాజీ జడ్జీ జస్టిస్‌ ఎఫ్‌ఎంఐ ఖలీఫుల్లా తమకు ఒక లేఖ రాశారని, ఇది ఆ ప్యానెల్‌ ముందే జరగవచ్చునని కాకపోతే వివరాలు బహిర్గతం కారాదని బెంచ్‌ స్పష్టం చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు గత నెల 6 నుంచి రోజూ విచారిస్తోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా