సీబీఐ వివాదం : సుప్రీంలో హైడ్రామా

20 Nov, 2018 11:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ వివాదంపై విచారణ జుగుప్సాకరంగా మారుతుండటం పట్ల సర్వోన్నత న్యాయస్ధానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ సర్కార్‌లోని ఓ మంత్రికి ముడుపులు ముట్టాయని, మరో సీబీఐ అధికారిపై దర్యాప్తులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ జోక్యం చేసుకుంటున్నారని దర్యాప్తు సంస్థకు చెందిన సీనియర్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ సిన్హా చేసిన ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. సిన్హా ఆరోపణలు సంచలనం సృష్టిస్తుంటే   దర్యాప్తులో భాగంగా అలోక్‌ వర్మ ఇచ్చిన సమాధానాలు లీక్‌ కావడం పట్ల కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఓ దశలో సీబీఐ వివాదంపై విచారణకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. 

కాగా, దర్యాప్తులో భాగంగా అలోక్‌ వర్మ చెప్పిన అంశాలను మీడియాకు లీక్‌ చేయడం పట్ల సీబీఐ డైరెక్టర్‌ వర్మ తరపు న్యాయవాది ఫాలి నారిమన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక వార్తాపత్రికల్లో వెలువడ్డ సిన్హా సంచలన వ్యాఖ్యలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ ప్రస్తావించగా నారిమన్‌ ఈ మేరకు పేర్కొన్నారు.

అలోక్‌ వర్మ కేసుకు సంబంధించిన అంశాలు మీడియాకు లీక్‌ కావడంపై జస్టిస్‌ గగోయ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీ పిటిషన్లు ఏవీ విచారణార్హమైనవని తాము భావించడం లేదని ఓ దశలో అసహనానికి లోనైన జస్టిస్‌ గగోయ్‌ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని నవంబర్‌ 29న విచారణకు చేపడతామని తదుపరి విచారణను వాయిదా వేశారు. ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ చీఫ్‌ అలోక్‌ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు