మమత వర్సెస్‌ కేంద్రం.. సుప్రీంలో సీబీఐకు నిరాశ

4 Feb, 2019 13:05 IST|Sakshi

అత్యవసర విచారణకు సుప్రీం నో

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. బెంగాల్‌ సీబీఐ ఎపిసోడ్‌పై అత్యవసర విచారణ జరపాలన్న ఆ సంస్థ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కోల్‌కత్తా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ శారద చిట్‌ఫండ్‌ కేసులో విచారణకు హాజరవ్వట్లేదని సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆయను వెంటనే సీబీఐ ముందు లొంగిపోయే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొంది. కేసుకు సంబంధించి సరైన సాక్ష్యాదారాలు చూపనందున పిటిషన్‌పై రేపు (మంగళవారం) విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున సీబీఐ అదనపు సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి రాజీవ్‌కుమార్‌కు పలుమార్లు సమన్లు జారీ చేశామని సీబీఐ తమ పిటిషన్‌లో పేర్కొంది. అయితే వాటికి ఆయన స్పందించకపోగా..  సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది. రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించేందుకు వెళ్లిన సీబీఐ అధికారులను అక్కడి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని పేర్కొంది. ఆయన వెంటనే లొంగిపోయేలా ఆదేశించాలని కోర్టును కోరింది.

మరిన్ని వార్తలు