ఆ వెబ్‌సైట్లను నిషేధించలేం: సుప్రీంకోర్టు

5 Dec, 2015 11:32 IST|Sakshi
ఆ వెబ్‌సైట్లను నిషేధించలేం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లను నిషేధించాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.  అయితే అభ్యంతరకర, అసభ్యకర సమాచారం వ్యాప్తి కాకుండా నిరోధించడంలో ఈ వెబ్‌సైట్లు విఫలమైతే.. వాటిపై విచారణ జరిపే అవకాశముందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ముంబైలో వాట్సాప్‌ ద్వారా అత్యాచార వీడియోల్ని వ్యాప్తి చేయడం, ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా సెక్స్ రాకెట్ ను నిర్వహిస్తూ.. చిన్నారులను ఆకర్షించడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చినా వాటిని తొలగించేందుకు ఆ వెబ్‌సైట్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రెండు కేసులు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయి.

వాట్సాప్‌లో లైంగిక దృశ్యాల వీడియోలు అప్‌లోడ్ చేసి.. షేర్‌ చేసుకునే వ్యక్తులను గుర్తించడం చాలా కష్టమని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. కంప్యూటర్ ద్వారా ఇలాంటి నేరానికి పాల్పడితే.. బాధ్యులను వెంటనే పట్టుకొని శిక్షించే అవకాశముందని, కానీ మొబైల్ ఫోన్ల  ద్వారా ఇలా చేస్తే పట్టుకోవడం కష్టమని కేంద్రం వివరించింది. వాట్సాప్‌ ద్వారా ఆ సమాచారం వ్యాప్తిని అడ్డుకోవడం కష్టమంటూ కేంద్రం నిస్సహాయత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయా నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లపై నిషేధం విధించాలని హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రజ్వల సుప్రీంకోర్టును కోరింది.

ఆయా వెబ్‌సైట్లను నియంత్రించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటుచేసేలా, వాట్సాప్‌లో వ్యాప్తి చెందుతున్న సమాచారంపై నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని ప్రజ్వల సంస్థ చీఫ్ సునితా కృష్ణన్ కోర్టును కోరారు. అయితే ఈ వెబ్‌సైట్లను నిషేధించడం ఆచరణసాధ్యమైన పరిష్కారం కాదంటూ సుప్రీంకోర్టు ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది.

మరిన్ని వార్తలు