శరవణభవన్‌ యజమానికి యావజ్జీవం

30 Mar, 2019 05:45 IST|Sakshi
హోటల్‌ శరవణభవన్‌ యజమాని రాజగోపాల్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన హోటల్‌ శరవణభవన్‌ యజమాని రాజగోపాల్‌కు ఓ హత్య కేసులో సుప్రీంకోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. జూలై 7వ తేదీలోగా కోర్టులో లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. హోటల్‌ శరవణభవన్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేసే రామస్వామి కూతురు జీవజ్యోతి (20) అదే హోటల్‌కు చెందిన మరో బ్రాంచ్‌లో పనిచేసేది. చెన్నై వాసి ప్రిన్స్‌ శాంతకుమార్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరు భార్యలున్న రాజగోపాల్‌ జీవజ్యోతిని ఎలాగైనా పెళ్లాడాలని ఆమె భర్త శాంతకుమార్‌ను కిడ్నాప్‌ చేయించి హత్య చేయించాడు. దీంతో రాజగోపాల్‌ సహా 11 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసును విచారించిన చెన్నై పూందమల్లి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు రాజగోపాల్‌కు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ 2004లో తీర్పు చెప్పింది. తర్వాత నిందితులు మద్రాసు హైకోర్టుకు, తదనంతరకాలంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు మద్రాసు హైకోర్టు ఇచ్చిన యావజ్జీవశిక్షను సమర్ధించింది. శరవణభవన్‌ గ్రూప్‌నకు దేశ, విదేశాల్లో కలిపి 20 వరకు హోటళ్లున్నాయి.  

మరిన్ని వార్తలు