‘ఎస్సీ, ఎస్టీ చట్టం’ రాజ్యాంగబద్ధమే

11 Feb, 2020 04:21 IST|Sakshi

సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం

ఎస్సీ, ఎస్టీలపై వివక్ష కొనసాగుతోందని ఆందోళన

కేసు నమోదుకు ప్రాథమిక విచారణ అక్కర్లేదని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం –2018 చట్టబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిరూపించలేకపోతే సదరు వ్యక్తికి బెయిల్‌ మంజూరు చేయవచ్చని కోర్టు పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందే ప్రాథమిక విచారణ అవసరం లేదని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరులంతా సమానమనీ, సోదరభావాన్ని పెంపొందించుకోవాలనీ, ముందస్తు బెయిల్‌ అవకాశాన్ని దుర్వినియోగం చేయడం పార్లమెంట్‌ ఉద్దేశాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతోందంటూ ఈ చట్టంలోని సెక్షన్‌ 18ఏ కింద పార్లమెంట్‌ ç2018లో సవరణలు చేసింది. అంతకుముందు డాక్టర్‌ సుభాష్‌ కాశీనాథ్‌ మహాజన్‌ వర్సెస్‌ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు ప్రభుత్వం ఈ సవరణలు చేపట్టింది. ఈ చట్టం దుర్వినియోగం అవుతోందని, తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు కొన్ని నిబంధనలను విధించింది.

వీటిలో ప్రధానమైవి.. ‘నిందితుడికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండటం. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందే ప్రాథమిక విచారణ చేపట్టడం, అరెస్టు చేయడానికి అనుమతి పొందాల్సి రావడం’. ప్రభుత్వోద్యోగుల విషయంలో అయితే నియామక అధికారి ఆమోదం, ప్రభుత్వేతర ఉద్యోగైతే సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఆమోదం పొందాకే అరెస్టు చేయాలని అప్పట్లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా నిష్ప్రయోజకంగా మార్చిందంటూ దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో తీర్పును సమీక్షించాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వపు హక్కులకు భంగకరమంటూ చట్ట సవరణలను వ్యతిరేకిస్తూ ఇంకొందరు కోర్టుకెళ్లారు.  ఎస్సీ, ఎస్టీల పట్ల దేశంలో కొనసాగుతోన్న వివక్ష కారణంగా చట్టం రూపకల్పనకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ చట్టం కింద క్రిమినల్‌ కేసు నమోదు చేయడానికి ప్రాథమిక విచారణ అక్కర్లేదని స్పష్టంచేసింది.

మరిన్ని వార్తలు