జీవో 550పై హైకోర్టు ఉత్తర్వులు రద్దు

25 Aug, 2018 01:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రక్రియలో జీవో 550లోని పేరా 5(2)ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేసింది. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే జరిగిన ప్రవేశాలను కదపరాదని స్పష్టం చేసింది. మాన్యువల్‌గా కౌన్సెలింగ్, స్లైడింగ్‌ అమలు చేసినంతవరకు జీవో 550 సరైనదేనని, అయితే దీన్ని ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా సహేతుకంగా అమలు చేయలేరని సుప్రీంకోర్టు పేర్కొంది. వచ్చే ఏడాది కౌన్సెలింగ్‌కు సంబంధించి తగు మార్పులు చేసుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాలకు అవకాశం ఇచ్చింది.

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కౌన్సెలింగ్‌లో ఓపెన్‌ కేటగిరీ సీటును వదులుకుని రిజర్వేషన్‌ కోటాలో మెరుగైన సీటును దక్కించుకున్నప్పుడు ఓపెన్‌ కేటగిరీలో ఖాళీ చేసిన సీటును అదే రిజర్వేషన్‌కు చెందిన మరో విద్యార్థితో భర్తీ చేయాలని నిర్దేశించే జీవో 550లోని పేరా 5(2)ను ఉమ్మడి హైకోర్టు ఇటీవల పక్కనపెట్టింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ 16 మంది విద్యార్థులతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, ఎన్టీఆర్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. గురువారం ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మాసనం శుక్రవారం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను మరోసారి పరిశీలించి రాతపూర్వకంగా సోమవారం వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. 

హైకోర్టు తీర్పును తప్పుపట్టిన ధర్మాసనం
న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా మౌఖిక ఆదేశాలు జారీ చేస్తూ ‘హైకోర్టు ఈ సమస్యను సరిగా అర్థం చేసుకోలేకపోయింది. ఓపెన్‌ కేటగిరీ సీటును వదులుకుని రిజర్వేషన్‌ కేటగిరీలో సీటు తీసుకున్నప్పుడు ఖాళీ అయిన ఓపెన్‌ కేటగిరీ సీటును రిజర్వేషన్‌ అభ్యర్థులతో భర్తీ చేయడానికి సంబంధించిన డేటాను హైకోర్టు సరైన రీతిలో విశ్లేషించలేదు. ఈ విధానంలో రిజర్వేషన్లు 50 శాతం మించలేదని స్పష్టమవుతోంది. ఇక జీవో 550లోని పేరా 5 మ్యాన్యువల్‌ కౌన్సెలింగ్‌లో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఆన్‌లైన్‌లో సీటు ఎంపిక, ఖాళీ, ఖాళీని అదే రిజర్వేషన్‌ కలిగిన అభ్యర్థితో భర్తీ చేయడం తదితర ప్రక్రియలన్నీ ఏకకాలంలో అమలుచేయడం కష్టసాధ్యం. అందువల్ల ఈ ఏడాది జరిగిన ప్రవేశాలకు అంతరాయం కల్పించరాదు. వచ్చే ఏడాది జీవో 550ని అమలు చేసుకోవడానికి ప్రభుత్వం అవసరమైన పక్షంలో తగిన మార్పులు చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు. విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఉదయ్‌కుమార్‌ సాగర్, పాల్వాయి వెంకటరెడ్డి, విద్యార్థుల తరఫున రమేశ్‌ అల్లంకి, ఎ.సత్యప్రసాద్, ఏపీ తరఫున గుంటూరు ప్రభాకర్, ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ తరఫున ఎం.ఎన్‌.రావు పాల్గొన్నారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు