‘అనంత’ సంపద ఎన్నడు తెలిసేను?

15 Jul, 2020 13:44 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని సంపన్న దేవాలయాల్లో ఒకటైన కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయ యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి ఈ  దేవాలయ పరిపాలనా హక్కులు ట్రావెన్‌కోర్‌ రాజ కుటుంబానికే చెందుతాయని స్పష్టం చేసింది. జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆలయ యాజమాన్య హక్కులపై దాదాపు 9 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలుకుతూ సోమవారం తుది తీర్పు వెలువరించింది.(పద్మనాభుడి ఆలయం ట్రావెన్‌కోర్‌ కుటుంబానిదే)

దీంతో పద్మనాభుడి ఆలయం కింద ఉన్న ఆరో నేలమాళిగలోని రహస్యం త్వరలోనే బయటపడుతుందన్న ఊహాగానాలకు తెరపడింది. అనంతపద్మనాభ స్వామి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. 18వ శతాబ్దంలో ట్రావెన్​కోర్​ సంస్థానాధీశుడు అనంతపద్మనాభ స్వామికి తన రాజ్యం మొత్తాన్ని ధారాదత్తం చేశాడు. చివరకు తనను తానే స్వామికి దాసుడిగా చేసుకున్నాడు.

2011లో సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ఆలయంలోని ఐదు నేళమాళిగలను తెరిచిన సంగతి తెలిసిందే. వీటిలో దాదాపు లక్ష కోట్ల రూపాయల సంపద ఉన్నట్లు లెక్కల్లో తేలింది. ఆరో నేళమాళిగను తెరిచేందుకు రాజకుటుంబ ఆధ్వరంలోని దేవాలయ పాలకమండలి ఒప్పుకోలేదు. ఆరో నేళమాళిగ శాపానికి గురైందని, అది తెరిస్తే భగవంతుడి ఆగ్రహానికి గురవక తప్పదని పురాణాల్లో ఉందని వెల్లడించింది.

ఆలయ చరిత్ర
పద్మనాభుడి ఆలయ చరిత్ర, ట్రావెన్​కోర్ సంస్థాన చరిత్రతో ముడిపడి ఉంది. అయితే, ఆలయం ఎప్పుడు నిర్మితమైందన్న దానిపై 2011లో కేరళ హైకోర్టు తీర్పు ప్రకారం భిన్నవాదనలున్నాయి. పురాణాల్లో కూడా ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందన్న దానిపై రకరకాల కథలున్నాయి.

స్పష్టంగా తెలిసిన విషయమేంటంటే... 18వ శతాబ్దం ప్రారంభంలో ఈ దేవాలయ బాధ్యతలను నాటి ట్రావెన్​కోర్​ పాలకుడు అనిఝామ్ తిరునాళ్ మార్తాండవర్మన్​ తన భుజానికి ఎత్తుకున్నాడు. రాజుతో కలిపి మొత్తం ఎనిమిదిన్నర(8+1/2) మందితో కూడిన బృందం ఆలయపాలనను చూసుకునేది. ఇక్కడ ఎనిమిదిన్నరను కేరళ హైకోర్టు తన తీర్పులో రాజు ఓటు విలువ అరగా పేర్కొంది. ఎనిమిది మందిలో ఏడుగురు బ్రహ్మణులు, ఒకరు నాయర్.

అయితే, 1720ల్లో బృందంలోని మిగతా ఎనిమిది మందితో రాజు మార్తాండవర్మన్​కు ఆలయ పాలనపై వివాదం తలెత్తింది. అర ఓటు హక్కు కలిగిన రాజుకు ఆలయ బాగోగుల్లో చాలా తక్కువ పాత్ర ఉండేదని కేరళ హైకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. ఈ ఎనిమిదిన్నర మందితో కూడిన బృందం ఆలయపాలనను చూసుకుంటే, మరో ఎనిమిది మందితో కూడిన ‘ఎట్టువీట్టిల్​ పిల్లామర్స్​’ఆలయ ఆస్తులను చూసుకునేది. ఈ బృందంలోని ఎనిమిది మంది నాయర్లు. వీరు ట్రావెన్​కోర్​ సంస్థానంలోని ఎనిమిది పెద్ద కుటుంబాలకు చెందినవారు.

కేరళ హైకోర్టు ప్రకారం.. మార్తాండవర్తన్​ను ఎలాగైనా గద్దె దించి, అతని సోదరి కుమారుడిని సంస్థానాదీశుడిని చేయాలని రెండు బృందాల్లోని సభ్యులు భావించారు. కానీ వీరోచిత పోరాటంతో మార్తాండ వర్మన్​ తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. అప్పటిదాకా ముక్కలుగా ఉన్న ట్రావెన్​కోర్​ రాజ్యాన్ని ఏకం చేయడానికి అనేక యుద్ధాలు చేసి విజయపతాకం ఎగురవేశాడు. 

ఈ కేసులో తుది తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు.. రాజకుటుంబానికి చెందిన ఓ యువరాజు రాసిన పుస్తకాన్ని ప్రస్తావించింది. మహాభారతంలోని అర్జునిడిలా, కళింగ యుద్ధం తర్వాత అశోకునిలా.. ప్రాణనష్టాన్ని చూసి మార్తాండవర్మన్​ చలించిపోయాడని, ఆ బాధ నుంచి బయటపడేందుకు తన రాజ్యాన్నంతటినీ పద్మనాభస్వామి ఆలయానికి ధారాదత్తం చేశాడని రచయిత రాసుకొచ్చారని చెప్పింది. ఆ తర్వాత దేవాలయ ఆలనాపాలనను మార్తాండవర్మే రాజ కుటుంబమే చూసిందని పేర్కొంది.

బ్రిటీష్ పాలన
1758లో 53 ఏళ్ల వయసులో మార్తాండవర్మన్ కాలం చేశారు. 1810 నాటికి ట్రావెన్​కోర్ సంస్థానం ఇద్దరు రాణులు గౌరీ లక్ష్మీ భాయ్, గౌరీ పార్వతి భాయ్ పాలనలోకి వచ్చింది. ఈ సమయంలో టిప్పు సుల్తాన్​పై యుద్ధాలకు బ్రిటీషర్లు, ట్రావెన్​కోర్​ అధిపతులకు సాయం చేశారు. ఆ తర్వాత రాణులు బ్రిటీషర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారారు. ఫలితంగా ట్రావెన్​కోర్​ సంస్థానంలోని ప్రతి ఆలయం బ్రిటీష్ పాలనలోకి వెళ్లిందని కేరళ హైకోర్టు 2011లో ఇచ్చిన తీర్పులో ప్రస్తావించింది.

1811లో సంస్థాన అవసరాలకు ఆలయం నుంచి డబ్బు తీసుకుని, తిరిగి చెల్లించేలా ట్రావెన్​కోర్ ఒప్పందం చేసుకోవడం పద్మనాభుడి సంపదను తెలియజేస్తుంది. బ్రిటిషర్లు చేసిన ఏర్పాట్ల ప్రకారం 1940 వరకూ ఆలయపాలన సాగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత నాటి పాలకుడు బలరామవర్మన్​తో సంప్రదింపుల అనంతరం ట్రావెన్​కోర్​ భారత్​లో విలీనమైంది. 

సమస్య ఎక్కడంటే?
ట్రావెన్​కోర్​ పాలకుడిగా బాధ్యతలు తీసుకునేప్పుడు బలరామవర్మన్​ ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇందుకు కారణం ఉంది. ట్రావెన్​కోర్​ సంస్థానాధీశుడిగా అనంతపద్మనాభ స్వామిని, బలరామవర్మన్ వంశం భావిస్తుంది. దేవుడి తరఫున మాత్రమే రాజ్యం ఆలనాపాలనా చూస్తారు. 1991లో బలరామవర్మన్​ కాలం చేశారు.

ఆ తర్వాత ఆయన సోదరుడు తిరునాళ్ మార్తాండవర్మన్ రాజ కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యారు. కేరళ ప్రభుత్వం గుడి మేనేజ్​మెంట్​లో ఆయన్ను సభ్యుడిగా ఉంచింది. కానీ ఆయన ఆలయ భూములు, రాజ కుటుంబానికి చెందినవేనని చేసిన ప్రకటనతో వివాదం రాజుకుంది. చాలా మంది భక్తులు దీనిపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. మార్తాండవర్మన్​కు గుడి మేనేజ్​మెంట్​పై ఎలాంటి హక్కులూ లేవని హైకోర్టు తీర్పునిచ్చింది. దాంతోపాటు గుడిలోని నేళమాళిగలను తెరవాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆ తర్వాత ఈ విషయం సుప్రీం కోర్టును చేరింది. దాంతో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం నేళమాళిగలను తెరవాలని ఆదేశించింది. మీడియా రిపోర్టుల ప్రకారం ఐదు గదుల్లో బంగారు విగ్రహాలు, వందల కిలోల బంగారు ఆభరణాలు, 60 వేలకు పైచిలుకు వజ్ర, వైఢూర్యాలు, రోమన్ బంగారు నాణెలు తదితరాలు లభ్యమయ్యాయి. దీంతో పద్మనాభస్వామి ఆలయ ఖ్యాతి ప్రపంచమంతటా పాకింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం ఇదేననే భావన అంతటా మొదలైంది. ఇక్కడ దొరికిన వస్తువుల విలువను లెక్కగట్టేందుకు కమిటీ సభ్యులు నేషనల్​ జాగ్రఫీ సొసైటీ సాయాన్ని కూడా కోరారు.

తుది తీర్పు
‘ట్రావెన్‌కోర్‌ రాజ కుటుంబానికి ఈ ఆలయంపై ఉన్న హక్కులు కొనసాగుతాయి. చివరి పాలకుడు బలరామ వర్మ సోదరుడు మార్తాండవర్మకు, ఆయన వారసులకు ఈ ఆలయంపై సర్వహక్కులు ఉంటాయి’అని స్పష్టం చేసింది.‘మరో కమిటీ ఏర్పాటయ్యే వరకు తిరువనంతపురం జిల్లా జడ్జి నేతృత్వంలోని కమిటీ ఆలయ పాలనా వ్యవహారాలను చూసుకుంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే కమిటీలో సభ్యులంతా హిందువులే అయి ఉండాలి’అని స్పష్టతనిచ్చింది. భవిష్యత్​లో ఏర్పాటుకానున్న కమిటీయే ఆరో నేళమాళిగను తెరవాలా లేదా అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోనుంది.

మరిన్ని వార్తలు