పద్మనాభుడి ఆలయం ట్రావెన్‌కోర్‌ కుటుంబానిదే

14 Jul, 2020 04:37 IST|Sakshi

మార్తాండవర్మ వారసులకే పరిపాలనా హక్కులు

కేరళ హైకోర్టు తీర్పును పక్కనబెట్టిన సుప్రీంకోర్టు  

న్యూఢిల్లీ: దేశంలోని సంపన్న దేవాలయాల్లో ఒకటైన కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి ఈ  దేవాలయ పరిపాలనా హక్కులు ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికే చెందుతాయని స్పష్టం చేసింది. జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆలయ యాజమాన్య హక్కులపై దాదాపు 9 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలుకుతూ సోమవారం తుది తీర్పు వెలువరించింది.

‘చివరి పాలకుడు మృతి చెందినందున రాష్ట్ర ప్రభుత్వమే ఆలయ యాజమాన్య కమిటీని నియమించాలనడం చెల్లదు. రాజకుటుంబానికి వారసులు లేనందున ఆస్తులన్నీ ప్రభుత్వానికే చెందుతాయన్న న్యాయపరమైన నిబంధన ఈ కేసుకు వర్తించదు. ట్రావెన్‌కోర్‌ పాలకుడి నియంత్రణలో ఆలయ యాజమాన్య కమిటీ కొనసాగుతుంది’అని తెలిపింది. ‘ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికి ఈ ఆలయంపై ఉన్న హక్కులు కొనసాగుతాయి. చివరి పాలకుడు బలరామ వర్మ సోదరుడు మార్తాండవర్మకు, ఆయన వారసులకు ఈ ఆలయంపై సర్వహక్కులు ఉంటాయి’అని స్పష్టం చేసింది.

‘మరో కమిటీ ఏర్పాటయ్యే వరకు తిరువనంతపురం జిల్లా జడ్జి నేతృత్వంలోని కమిటీ ఆలయ పాలనా వ్యవహారాలను చూసుకుంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే కమిటీలో సభ్యులంతా హిందువులే అయి ఉండాలి’అని స్పష్టతనిచ్చింది. ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికి చెందిన చివరి పాలకుడు బలరామ వర్మ 1991లో మరణించారు. దీంతో పద్మనాభస్వామి ఆలయంపై ఆయన వారసులకు హక్కులు లేవనీ, ఆలయాన్ని, అందులోని సంపదను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని, ఒక కమిటీ నేతృత్వంలో నిర్వహించాలంటూ 2011 జనవరిలో కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిని సవాల్‌ చేస్తూ ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఏప్రిల్‌లో స్టే విధించింది.

ఇది చారిత్రక తీర్పు..
సుప్రీంకోర్టు తాజా తీర్పు చరిత్రాత్మకమని, సుప్రీంకోర్టు నియమించిన ఆలయ కమిటీ చైర్మన్‌ సీవీ ఆనంద బోస్‌ అన్నారు. తీర్పు.. మత విషయాల్లో రాజకీయాలు, రాజకీయాల్లో మతం జోక్యం చేసుకోరాదనే సందేశాన్నిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఒక్కసారిగా ప్రపంచం దృష్టికి..
పూర్వం కేరళలోని దక్షిణ భాగం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబం పాలించేది. ఈ పాలకుల కుటుంబదైవం అనంతపద్మనాభ స్వామి(విష్ణువు). తిరువనంతపురంలోని పురాతన అనంత పద్మనాభస్వామి ఆలయం స్థానంలో 18వ శతాబ్దంలో అద్భుతమైన నిర్మాణ కౌశలంతో కూడిన విశాలమైన ఆలయాన్ని ఈ పాలకులు నిర్మించారు. ఈ ఆలయ అంతర్భాగంలోని ఆరు నేలమాళిగల్లో వెలకట్టలేని సంపద ఉన్నట్లు ప్రతీతి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా ఈ రాజకుటుంబం నేతృత్వంలోనే ఆలయ నిర్వహణ కొనసాగింది.

అయితే, అపార సంపదలున్న ఈ ఆలయ నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు రావడంతో వివాదం కోర్టుదాకా వెళ్లింది. దీంతో, ఆలయ నిర్వహణను, ఆస్తులను స్వాధీనం చేసుకుని సంప్రదాయం ప్రకారం నిర్వహణ చేపట్టాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకుటుంబం సవాల్‌ చేయడంతో కేరళ హైకోర్టు తీర్పుపై 2011లో స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఆలయంలోని నేలమాళిగ(కల్లారం)ల్లో భద్రపరిచిన ఆభరణాలు, సంపదను లెక్కకట్టాలనీ, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలనీ, ఆలయ నిర్వహణపై ఆడిటింగ్‌ చేపట్టాలని ఆదేశించింది.

లాయర్‌ గోపాల్‌ సుబ్రమణ్యంను అమికస్‌ క్యూరీగా నియమించింది. నేలమాళిగ ‘బి’లో అద్భుత శక్తులతో కూడిన అపార సంపద ఉన్నందున తెరవరాదంటూ అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దీనిపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ మేరకు సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘా మధ్య మొదటి నేలమాళిగలోని సంపద లెక్కింపు కూడా చేపట్టారు. అనూహ్యంగా వేల కోట్ల విలువైన సంపద ఉన్నట్లు అంచనాలు వెలువడటంతో ఈ ఆలయం ప్రాభవం ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

మరిన్ని వార్తలు