తెలుగులోనూ సుప్రీం తీర్పులు

4 Jul, 2019 14:58 IST|Sakshi

ఆరు భాషల్లోకి అనువాదం

ఈ నెలాఖరుకు అందుబాటులోకి!

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తాను చెప్పే తీర్పులను కేవలం ఇంగ్లిష్‌లోనే కాకుండా తెలుగు సహా ఆరు భారతీయ భాషల్లో కూడా త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ఇంగ్లిష్‌ నుంచి హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒడియా, అస్సామీ భాషల్లోకి తీర్పులను అనువదించి, వాటిని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఆమోదం తెలిపారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇందుకోసం సుప్రీంకోర్టుకే చెందిన ఎలక్ట్రానిక్‌ సాఫ్ట్‌వేర్‌ విభాగం ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించింది.

అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల చివరికే తీర్పులు ఈ ఆరు ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే తీర్పులు వెలువడిన రోజు వాటిని ఇంగ్లిష్‌లో మాత్రమే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఆ తర్వాత వారం రోజులకు ఆరు ప్రాంతీయభాషల్లోనూ తీర్పులను అప్‌లోడ్‌ చేయనున్నారు. ప్రాంతీయభాషల్లో కూడా తీర్పులను ప్రజలకు అందుబాటులో ఉంచితే ప్రయోజనకరంగా ఉంటుందని 2017లో రాష్ట్రపతి సూచించారు. 

మరిన్ని వార్తలు