కాలుష్య నివారణకు సలహాలు ఇవ్వండి: సుప్రీం కోర్టు

19 Feb, 2020 16:23 IST|Sakshi

న్యూఢిల్లీ: కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు బుధవారం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాలుష్య నివారణకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యమిస్తున్నారని సీజేఐ ఎస్‌ఏ బాబ్డే వ్యాఖ్యానించారు. కాలుష్య నివారణకు ఆయన సుప్రీం కోర్టుకు పరిష్కార మార్గాలను సూచించాల్సిందిగా కోరారు.

ఇక ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన విధానాన్ని అవలంభిస్తుందన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రశాంత్‌ భూషన్‌ కేంద్రానికి  ఓ సలహా ఇచ్చారు. పెట్రోల్‌, డీజిల్‌ కార్లపై అధిక పన్నులు వసూలు చేసి ఎలక్ట్రిక్‌ వాహనాలకు సబ్సిడి ఇవ్వాలని సూచించారు.

పటాసులు కాల్చడం వాతావరణానికి కొంతమేర హాని కలిగించినా, మోటారు వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్యం దీర్ఘకాలికంగా వాతావరణాన్ని నాశనం చేస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. వాతావరణ కాలుష్యపై సమగ్రంగా విచారించాలనుకుంటున్నట్లు సీజేఐ పేర్కొన్నారు. కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో నాలుగు వారాల్లోగా తెలపాలని ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు