‘సుప్రీం’ కొత్త రోస్టర్‌

25 Jun, 2018 02:06 IST|Sakshi

సీజేఐ దీపక్‌ మిశ్రా ధర్మాసనానికే ‘పిల్స్‌’  

న్యూఢిల్లీ: న్యాయమూర్తులకు కేసుల కేటాయింపు చేస్తూ సుప్రీంకోర్టు ఆదివారం కొత్త రోస్టర్‌ను విడుదల చేసింది. ఈ రోస్టర్‌ జూలై 2 నుంచి (వేసవి సెలవుల ముగిసి కోర్టు ప్రారంభం అయ్యాక) అమల్లోకి రానుంది. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిగా జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ రిటైరైన రెండ్రోజుల్లోనే ఈ జాబితా సిద్ధవమడం గమనార్హం. ఈ రోస్టర్‌ ప్రకారం.. సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ సామాజిక న్యాయం, ఎన్నికలు, హెబియస్‌ కార్పస్, కోర్టు ధిక్కరణతోపాటు అన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించనుంది. రెండో సీనియర్‌ జడ్జి అయిన జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని బెంచ్‌.. కార్మిక చట్టాలు, పరోక్ష పన్నులు, పర్సనల్‌ లా– కంపెనీ లా కేసులను విచారించనుంది.

జస్టిస్‌ లోకుర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పర్యావరణ అసమతుల్యత, అటవీ సంరక్షణ, జంతు సంరక్షణ, భూగర్భ జలాలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. మరో సీనియర్‌ జడ్జి జోసెఫ్‌ కురియన్‌ నేతృత్వంలోని బెంచ్‌.. కార్మిక చట్టాలతోపాటు అద్దె చట్టం, కుటుంబ వివాదాలు, కోర్టు ధిక్కరణ, పర్సనల్‌ లా కేసులను విచారిస్తుంది. ఐదుగురు సీనియర్‌ న్యాయమూర్తుల కొలీజియంలో కొత్తగా చేరిన జస్టిస్‌ ఏకే సిక్రీ ధర్మాసనం.. పరోక్ష పన్నులతోపాటు ఎన్నికలు, క్రిమినల్‌ కేసులు, ఆర్డినరీ సివిల్‌ కేసులు, న్యాయాధికారుల నియామకం తదితర అంశాలను విచారిస్తుంది. ఈ ఐదుగురితోపాటు.. మరో ఆరుగురు న్యాయమూర్తుల నేతృత్వంలోనూ ధర్మాసనాలు ఏర్పాటుచేసినట్లు కొత్త రోస్టర్‌ పేర్కొంది. ఎస్‌ఏ బాబ్డే, ఎన్‌వీ రమణ, అరుణ్‌ మిశ్రా, ఏకే గోయల్, ఆర్‌ఎఫ్‌ నారీమన్, ఏఎమ్‌ సప్రేల నేతృత్వంలోనూ పలు కేసుల కేటాయింపులతో ధర్మాసనాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 

మరిన్ని వార్తలు